ఏపీ రాజకీయాలు ఎప్పుడు కులాలు ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాలపై నుంచి ఏపీ రాజకీయాలని కమ్మ, రెడ్డి సామాజికవర్గం వారే డామినేట్ చేస్తున్నారు. అయితే మధ్యలో కాపులకు ప్రజారాజ్యం ద్వారా డామినేషన్ చేసే అవకాశం దక్కినా, అది తర్వాత వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు జనసేనతో కాపులు కాస్త పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా...కమ్మ, రెడ్డి వర్గాల డామినేషన్‌కు ఎప్పుడు చెక్ పడలేదు. మొన్న ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ వారి డామినేషన్ ఉండగా, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి వర్గం ఆధిపత్యం కొనసాగుతుంది. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని జిల్లాల్లో టీడీపీ రెడ్డి నేతలు, కాంగ్రెస్‌లో కమ్మ నేతలు బాగానే ఆధిపత్యం చెలాయించేవారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఎవరు అధికారంలో ఉన్న కమ్మ నేతల ప్రభావమే ఎక్కువగా ఉండేది.
టీడీపీ ఆవిర్భావం అంటే 1983 నుంచి ఇక్కడ కమ్మ నేతల హవా ఉంది. మధ్యలో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు కూడా వారి ఆధిపత్యం ఏమి తగ్గలేదు. మామూలుగా టీడీపీలో కమ్మ నేతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక గుంటూరు లాంటి జిల్లాలో అయితే చెప్పనక్కర్లేదు. మెజారిటీ నియోజకవర్గాల్లో వారే ఎమ్మెల్యేలుగా ఉండేవారు. 2014లో అధికారంలోకి వచిన్నప్పుడు కూడా ధూళిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాసరావు, జివి ఆంజనేయులు, కోడెల శివప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావులాంటి కమ్మ నేతలే పెత్తనం చేశారు.
అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004, 2009 సమయాల్లో కూడా కమ్మ నేతల ఆధిపత్యానికి ఎలాంటి లోటు లేదు. రాయపాటి, మర్రి రాజశేఖర్, నాదెండ్ల మనోహర్, దేవినేని చంద్రశేఖర్, రావి వెంకటరమణ లాంటి వారి హవా నడిచింది. కానీ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ జిల్లాలో కమ్మ నేతల ఆధిపత్యానికి చెక్ పడింది. ప్రస్తుతానికి జిల్లాలో వైసీపీ తరుపున ఉన్న కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వారి ప్రభావం అంతగా లేదు.
ప్రస్తుతం వైసీపీలో తెనాలి, వినుకొండ, పెదకూరపాడు ఎమ్మెల్యేలు నరసారావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కమ్మ వారే. అయితే తొలిసారి గెలవడంతో గుంటూరులో వీరి హవా ఎక్కువగా ఉండటం లేదు. అయితే గుంటూరులో వైసీపీని నడిపించేది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అని తెలుస్తోంది. మొత్తానికైతే మూడు దశాబ్దాల తర్వాత గుంటూరులో కమ్మ ఆధిపత్యం తగ్గిందనే చెప్పొచ్చు.