గల్వాన్ లోయ ఘటన అనంతరం చైనా విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా కేంద్రం చైనా యాప్ లపై కొరడా ఝళిపించింది. టిక్ టాక్ తో సహా 59 యాప్ లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ యాప్ లు వినియోగదారుల నుంచి సమాచారం సేకరిస్తూ ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ యాప్ లను నిషేధించి చైనాకు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 
 
మరోవైపు భారత్ సరిహద్దు విషయంలో చైనాకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా భారత్ దేశాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. గల్వాన్ లోయ ఘటనకు ముందు చైనా విషయంలో సంయమనంతో వ్యవహరించిన విదేశాంగ శాఖ ప్రస్తుతం ఖచ్చితమైన ప్రకటనలు ఇస్తోంది. తాజాగా విదేశాంగ శాఖ సరిహద్దుల్లో బలప్రయోగం యాధాతథ స్థానాన్ని మార్చటానికి ప్రయత్నిస్తే ఆ ప్రాంతంలో శాంతి దెబ్బతినడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రకటన చేసింది. 
 
తూర్పు లడఖ్ లో చైనా కార్యకలాపాలు నిలిపివేయాలని భారత్ డిమాండ్ చేసింది. బలప్రయోగాలు, బెదిరింపులతో తూర్పు లడఖ్ లో యథాతథ స్థితిని మార్చే ప్రయత్నం చేస్తే అంగీకరించబోమని తేల్చి చెప్పింది. వాస్తవాధీన రేఖలో భారత్ మన దేశపు భూభాగంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోందని.... గతంలో ఎలాంటి వివాదం లేని గల్వాన్ లోయ ప్రాంతంలో యథాతథ పరిస్థితిని మార్చటానికి చైనా బలగాలు ప్రయత్నిస్తున్నాయని విదేశాంగ శాఖ చెబుతోంది. 
 
కొంతకాలంగా చైనా చేస్తున్న కార్యకలాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని..... మే నెల నుంచే సరిహద్దులో చైనా అనేక కార్యకలాపాలకు పాల్పడిందని.... భారత బలగాల సాధారణ గస్తీని అడ్డుకుందని... తూర్పు లడఖ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు పూర్తి కారణం చైనానే అని భారత్ చెబుతోంది. ఎవరి హద్దుల్లో వాళ్లు ఉందామని ఒక దేశం సరిహద్దులను మరో దేశం దాటకూడదని భారత్ చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: