దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ప్రతిరోజూ రికార్డుస్థాయిలో దాదాపు 20,000 కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు నేటితో అన్ లాక్ 1.0 ముగియనుంది. ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అన్ లాక్ 2.0 గురించి మోదీ ప్రధానంగా ప్రసంగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
కేంద్ర హోం శాఖ అన్ లాక్ 2.0లో మరిన్ని కార్యకలాపాలకు దశలవారీగా అనుమతులు ఇవ్వనుంది. కంటైన్మెంట్ జోన్లలో జులై 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. కేంద్రం అన్ లాక్ 2.0లో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు ఎటువంటి అనుమనులు, పర్మిట్లు అవసరం లేకుండా దేశంలో ఎక్కడైనా తిరగొచ్చని కేంద్రం పేర్కొంది. కేంద్రం అన్ లాక్ 2.0లో దేశీయ విమానాలు, రైళ్ల రాకపోకలను పరిమితంగా అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆన్ లైన్, దూర విద్య విధానాలను కొనసాగించవచ్చునని పేర్కొంది. జులై 15వ తేదీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శిక్షణ సంస్థలు తెరచుకోవచ్చని పేర్కొంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ వీటి నిర్వహణ కోసం ఆదేశాలు జారీ చేస్తుంది. జులై 31వ తేదీ వరకు కేంద్రం పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లపై నిషేధం విధించింది. మెట్రో రైళ్లు, వ్యాయామ శాలలు, సినిమా హాళ్లపై కూడా నిషేధం అమలు కానుంది.
ప్యాసింజర్ రైళ్లు, శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, విదేశాల్లో నిలిచిపోయిన భారతీయుల తరలింపు వంటివి ఇప్పటికే జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయి. దేశవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతోంది. కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసే నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ జోన్లను ప్రకటించాల్సి ఉంటుంది.