సహనానికీ  హద్దుంటుంది. ఆ సహనం గట్టుతెగితే.. ఎంతకైనా తెగిస్తాం. ఇప్పుడు భారత్ అదే చేసింది. డ్రాగన్ ఓవరాక్షన్ కు తన మార్కు రియాక్షన్ తో బుద్ధిచెప్పింది భారత్.   చైనా భారత్‌లోకి సరిహద్దుల్లోంచే కాదు.. డిజిటల్‌ మార్గంలోనూ చొరబడాలని చూస్తోంది. అందుకే చైనాకు డిజిటల్‌గా చెక్‌ పెట్టేసింది భారత్. 

 

సరిహద్దుల్లో చైనా దూకుడుకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే చైనా వస్తువులను నిషేధించాల్సిందేనని పలు వర్గాల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే వస్తువులను నిషేధించడం కన్నా యాప్‌లను నిషేధిస్తేనే భారత ఆర్థిక వ్యవస్థకు మేలు అని కొంతమంది నిపుణులు చెబుతూ వస్తున్నారు. వస్తువులను నిషేధిస్తే మన ఎగుమతులపైనా ప్రభావం పడుతుంది. యాప్‌లను నిషేధిస్తే సమాచార తస్కరణ ఆగిపోవడంతో పాటు చైనా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం ఉంటుంది. 

 

భారత్‌లో ప్రధానంగా నాలుగు రకాల చైనా యాప్‌లు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. ఎకనమిక్‌ యాప్‌లు, వ్యానిటీ యాప్‌లు, న్యూసెన్స్‌ యాప్‌లు, చైనా గురించి ఊదరగొట్టే  యాప్‌లు- ఈ నాలుగు రకాల్లో కనీసం మూడు రకాలను నిషేధించాలని కొంత మంది నిపుణులు కొన్నాళ్లుగా చెబుతున్నారు. బైదూ లాంటి యాప్‌లు.. చైనాకు డిజిటల్‌ సిల్క్‌ రూట్‌లాంటివి. భారత మార్కెట్‌లో వాటిపై ఎలాంటి ప్రభావం పడినా ఆ కంపెనీల విలువపై ప్రభావం పడుతుంది. టిక్‌టాక్‌ యాప్‌నే తీసుకుంటే దాదాపు 30శాతం వినియోగదారులు భారత్‌నుంచే ఉన్నారు. పదిశాతం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. ఈ ఆదాయమంతా టిక్‌టాక్‌ కోల్పోక తప్పదు. అది అంతిమంగా చైనా ఆర్థిక వ్యవస్థకు ఎంతోకొంత నష్టం కలిగిస్తుంది. భారత్‌ అనుసరించిన ఈ మార్గాన్ని మరికొన్ని దేశాలు కూడా అనుసరించే అవకాశం ఉంది. దీంతో చైనాకు మరింత నష్టం కలగక తప్పదు.

 

ఈ యాప్‌లను యాక్సెస్‌ చేసే అవకాశాన్ని నిలిపేయాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశిస్తూ సూచనలు వెలువడతాయి. ఇంటర్నెట్‌ అవసరం లేని క్యామ్‌స్కానర్‌లాంటి యాప్‌లు ఇప్పటికే డౌన్‌లోడ్‌ అయి ఉంటే పని చేసే అవకాశం ఉంది. అయితే కొత్తగా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పటికే డౌన్‌లోడ్‌ అయి ఉన్నా.. ఇంటర్నెట్‌ అవసరమయ్యే టిక్‌టాక్‌, యూసీ న్యూస్‌ వంటి యాప్‌లు పని చేయవు.

 

చైనా యాప్స్ నిషేధించడంపై మన దేశంలో సానుకూల స్పందన వస్తోంది. దేశ భద్రతే లక్ష్యంగా టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు  విజయ్‌ శేఖర్‌ శర్మ స్వాగతించారు. విశేష జనాదరణ పొందిన టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, వియ్‌ చాట్‌, షేర్‌ ఇట్‌ తదితర యాప్‌లను దేశంలో నిషేధించడం దేశ ప్రయోజనాల విషయంలో తీసుకున్న ఓ సాహసోపేతమైన అడుగుగా అభివర్ణించారు. డిజిటల్‌ చెల్లింపులు, ఈ-కామర్స్‌ సేవలందిస్తున్న పేటీఎం యాప్‌ను  వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ అనే భారత సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదో మొబైల్‌ ఇంటర్నెట్‌ కంపెనీ. దీనిలో చైనా కంపెనీలైన ఆలీబాబా, యాంట్‌ ఫైనాన్స్‌ సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి.  అయినప్పటికీ పేటీఎం చైనా యాప్‌ల నిషేధాన్ని సమర్ధిస్తోంది. 

 

టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లను నిషేధించి..సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకోవాలన్న మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యపై డ్రాగన్‌ స్పందించింది. ఈ చర్య తమని తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. 
అంతర్జాతీయ, ఆయా దేశాల నియమ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగానే వ్యవహరించాలని చైనా కంపెనీలకు చెబుతుంటామని ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది డ్రాగన్. భారత్‌ సైతం నిబంధనలకు అనుగుణంగా చైనా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హక్కులు కల్పించాలంటూ.. జరిగే నష్టాన్ని చెప్పుకోలేక  మేకపోతు గాంభీర్యాన్ని  ప్రదర్శించింది చైనా. 

 

చైనా ఆర్థిక మూలాలకు హెచ్చరికలు పంపే వ్యూహంలో భాగంగా యాప్‌లను నిషేధించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం డ్రాగన్‌ను కలవరపెడుతున్నట్లు కనిపిస్తోందన్నది భారతీయ  నిపుణుల అభిప్రాయం.  టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌ల వల్ల భారత సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు ముప్పు పొంచి ఉండడంతో ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69-ఎ కింద వీటిని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై స్పందించిన టిక్‌టాక్‌.. భారత నిబంధనలకు తాము అనుసరిస్తున్నామని చెప్పుకొచ్చింది.

 

సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా మరోసారి భారత్‌పై తన అక్కసును వెల్లగక్కింది. చైనాలో భారత్‌కు చెందిన వార్త పత్రికలు, వెబ్‌సైట్లను ప్రజలకు దూరం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. చైనా వార్తాపత్రికలు, వెబ్‌సైట్లపై భారత్‌ నిషేధం విధించకపోయినప్పటికీ.. డ్రాగన్‌ ఇలా తన వక్ర బుద్ధిని చాటుకుంది.

 

బీజింగ్‌లోని దౌత్యాధికారుల సమాచారం ప్రకారం.. చైనాలో భారత మీడియాకు చెందిన వెబ్‌సైట్లను ఇక మీదట వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ సర్వర్‌ ద్వారా మాత్రమే పొందగలిగేలా నిబంధనలు మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఇండియన్‌ టీవీ ఛానళ్లను ప్రస్తుతానికి ఐపీ టీవీ ద్వారా పొందవచ్చు. ఐఫోన్లు, డెస్క్‌టాప్‌ల్లో ఎక్స్‌ప్రెస్‌ వీపీఎన్‌ గత రెండు రోజులుగా ఇక్కడ పనిచేయడం లేదు. 

 

చైనాకు చెందిన టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌లాంటి 59 యాప్‌లపై భారత్‌ నిషేధం విధించిన నేపథ్యంలో డ్రాగన్‌ ఇలా ప్రతీకార చర్యలకు దిగింది. ప్రపంచంలోనే చైనాలో ఆన్‌లైన్‌ సెన్సార్‌షిప్‌ ఎక్కువగా ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా రాసే వెబ్‌సైట్లపై నిషేధం విధించడం ఇక్కడ పరిపాటే. ఇప్పటికే 10 వేలకుపైగా వెబ్‌సైట్లపై చైనా నిషేధం విధించిందని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు గత నవంబర్‌లో  పేర్కొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: