చైనాతో ఓ వైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు యుద్ధం రాకపోయినా సరే.. ఆ ప్రమాదం అయితే తొలగిపోలేదు. ఓవైపు చర్చల్లో సానుకూలంగా స్పందిస్తూనే చైనా వెనుక గోతులు తవ్వుతోంది. సరిహద్దుల్లోకి బలగాలను పంపుతోంది. అందుకే భారత్ కూడా తనవంతుగా సన్నద్ధతలో జాప్యం లేకుండా జాగ్రత్త పడుతోంది.

 

 

ఏ నిమిషంలో యుద్ధం వచ్చినా సిద్ధంగా ఉండాలన్న తలపుతో సర్వసన్నద్ధంగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్న వేళ సైన్యం తన అస్త్రాలను మెరుగుపరుచుకుంటోంది.. ఆయుధాల విషయంలో ఇండియాకు మొదటి నుంచి చక్కటి నేస్తం రష్యా. అందుకే రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

 

 

33 యుద్ధ విమానాల్లో సుఖోయ్ సు- 30ఎంకేఐ ఫైటర్లు 12, మిగ్ -29 ఫైటర్లు 21 ఉన్నాయి. వీటితో పాటు మరో 59 మిగ్ -29యుద్ధ విమానాల ఆధునికీకరణకు కూడా రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 18, 148 కోట్లు. వీటితో పాటు గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను కూల్చగలిగే 248 అస్త్ర బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులను వాయుసేన, నౌకాదళం కోసం ఇండియా రెడీ చేసుకుంటోంది.

 

 

విదేశాల నుంచి తెచ్చుకునే ఆయుధాలతో పాటు స్వదేశీయంగానూ ఇండియా తన శక్తిని సమకూర్చుకుంటోంది. భూమిపై నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల తయారీకి డీఆర్‌డీవో కి రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. మొత్తంగా దేశీయ రక్షణ సంస్థలకు సంబంధించిన రూ. 31, 130 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రక్షణశాఖ సమీకరణ మండలి ఆమోదం తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: