ప్రతిపక్షంలో ఉండగా జగన్ మోహన్ రెడ్డి...రాష్ట్రమంతా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర సమయంలో ఏ జిల్లాకు ఆ జిల్లాలో సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేసే సమయంలో పలు సమస్యలని తెలుసుకుంటూనే, అధికారంలోకి రాగానే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చారు.

 

అయితే జగన్ అధికారంలోకి రాగానే ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వెళుతున్నారు.  కాకపోతే పాదయాత్రలో చెప్పినట్లుగా కృష్ణా జిల్లాని ఇంకా ఎన్టీఆర్ జిల్లాగా మార్చలేదు. జిల్లాల పునర్విభజన ఉన్న నేపథ్యంలో ఈ హామీని పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలని 25 జిల్లాలుగా చేయడానికి జగన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న కృష్ణా జిల్లాని కూడా రెండు జిల్లాలుగా చేస్తారని తెలుస్తోంది.

 

విజయవాడ, మచిలీపట్నం జిల్లాలుగా అవి మారనున్నాయి. అయితే పాదయాత్రలో ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చారు కాబట్టి...ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు పామర్రు అసెంబ్లీ పరిధిలో ఉంది. ఇక పామర్రు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. దీంతో జిల్లా కానున్న మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందనేది రానున్న రోజుల్లో చూడాలి.

 

అయితే ఎన్టీఆర్ పేరు మాదిరిగానే కృష్ణా జిల్లాకు దివంగత వంగవీటి రంగా పేరు పెట్టాలని మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. తాజాగా రంగా జయంతి సందర్భంగా బీజేపీ నేత వంగవీటి నరేంద్ర ఈ డిమాండ్ బయట పెట్టారు. కృష్ణా జిల్లాను ఎలాగో రెండు జిల్లాలుగా మారుస్తారనే ప్రచారం జరుగుతుందని, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పెడతానని హామీ ఇచ్చారు కాబట్టి...మరొక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరును పెట్టాలని కోరారు. దీనిపై సీఎం జగన్‌కు ఇప్పటికే లేఖ రాశామని, పరిశీలించి ప్రకటిస్తారని భావిస్తున్నామని అన్నారు. అంటే మచిలీపట్నంకు ఎన్టీఆర్ పెడితే, విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలి. మరి ఈ పేర్లు విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: