దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అన్ లాక్ 2.0 సడలింపుల అనంతరం కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రజల్లో కొంతమంది మాస్క్ లు ధరించకపోవడం, భౌతికదూరం విషయంలో నిర్లక్ష్యం వల్లే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంది. జగన్ తీసుకున్న నిర్ణయం వల్లే ఏపీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ రాష్ట్రంలో వైరస్ విజృంభించిన తొలినాళ్ల నుండి అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9.96 లక్షల టెస్టులు చేశారు.
ఏపీలో దాదాపు 10 లక్షల టెస్టులు చైయడం ద్వారా కరోనా సోకిన వారిని త్వరగానే గుర్తించడం జరుగుతోంది. అందువల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతోంది. రాష్ట్రంలో చేసిన పరీక్షల పరంగా చూస్తే కరోనా పాజిటివ్ రేటు 1.77గా ఉంది. అయితే తెలంగాణలో మాత్రం ఈ రేటు 20.18 శాతంగా ఉంది. ఏపీలో నిన్న ఒక్కరోజే 765 కేసులు నమోదు కాగా తెలంగాణలో 1,850 కేసులు ఉన్నాయి.
తెలంగాణలో ఏపీకి రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్య పెంచితే కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.