చైనా దేశం గతంలో చేసిన, ప్రస్తుతం చేస్తున్న తప్పులు ఆ దేశానికి శాపాలుగా మారుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో చైనా నిర్లక్ష్యం వహించటం వల్ల ఇప్పుడు ఆ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. లక్షల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ భారీన పడి మరణిస్తున్నారు. గల్వాన్ లోయలో చైనా దుశ్చర్య వల్ల 20 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటన అనంతరం భారత్ కు మద్దతు ఇచ్చే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ప్రపంచ దేశాల నుంచి చైనాపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హాంగ్ కాంగ్ ను రాజకీయంగా హస్తగతం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తుండగా డ్రాగన్ కు అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామ్రాజ్యవాద విస్తరణ ధోరణితో చైనా విర్రవీగుతున్న చర్యలను ఖండిస్తూ అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు చైనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. తాజాగా జపాన్ చైనా వైఖరిని తప్పబట్టింది.
లఢఖ్ లో సరిహద్దులను మార్చే ప్రక్రియను తాము వ్యతిరేకిస్తామని జపాన్ పేర్కొంది. జపాన్ రాయబారి సతోషీ సుజుకీ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జపాన్ కు వెళ్లాల్సి ఉండగా వైరస్ విజృంభణ వల్ల వాయిదా పడింది. అయితే మరో తేదీని ప్రకటించటానికి జపాన్ సిద్ధంగా లేదని తెలుస్తోంది.
అమెరికా భారత్ సరిహద్దుల్లో చైనా దురాక్రమణల పర్వం ఆ దేశం అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని పేర్కొంది. ఫ్రాన్స్ చైనా భారత్ విషయంలో సాగిస్తున్న కుట్రపూరిత చర్యలను తిప్పికొట్టేందుకు మన దేశానికి అండగా ఉంటామని కీలక ప్రకటన చేసింది. బ్రిటన్ సైతం చైనా దుందుడుకు వైఖరి సరికాదని చెబుతూ భారత్ కు మద్దతు పలికింది. ప్రపంచ దేశాలు గల్వాన్ ఘటన వల్ల చైనాను ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.