మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు గా తయారైంది ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పరిస్థితి. ఇప్పటికే పార్టీ నాయకులు ఎవరు ఆందోళన కార్యక్రమాలకు కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు కానీ, ముందు వచ్చే పరిస్థితి లేదు. పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు  వస్తున్నా పట్టించుకునేవారు కనిపించడం లేదు. అలాగే పార్టీ ఆదేశాల ప్రకారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కావాల్సిన సొమ్ములు బయటకు తీసేందుకు, ఏ ఒక్క నేత ఇష్టపడడం లేదు. ఒకవేళ పార్టీ నిర్ణయం ప్రకారం బయటకి వచ్చి ఆందోళనలు చేపట్టినా, అధికార పార్టీ  టార్గెట్ చేసుకుంటుంది ఏమో అన్న భయం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. అందుకే ఎవరికి వారు, తమకు ఎందుకు వచ్చింది లే అన్నట్టుగా సైడ్ అయిపోయే పరిస్థితి నెలకొంది.
 
IHG
 
 ఇది ఇలా ఉంటే, ఇప్పుడు అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టేందుకు సిద్దమవుతుండటంతో, తెలుగుదేశం పార్టీ లో ఆందోళన పెరిగిపోతుంది. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నాయకులంతా, అరెస్ట్ అవుతుండడం , మిగతా వారు అనేక వివాదాల్లో చిక్కుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో  మిగిలిన నాయకుల్లో కూడా భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ లోకి వెళ్తే, తమకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఎవరికి వారు అధికార పార్టీలోకి చేరేందుకు సిద్ధమంటూ, ఆ పార్టీ నాయకులతో మంతనాలు చేస్తున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు వరకు పెద్ద ఎత్తున టిడిపి నాయకులంతా వచ్చి చేరారు. ఇక ఆ తర్వాత అవి వాయిదా పడటం, ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావం వంటి కారణాలతో ఆ చేరికలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 
 
 
మళ్ళీ జూలై ఎనిమిదో తేదీ అనగా వైఎస్సార్ జయంతి రోజున పెద్దఎత్తున నాయకులను చేర్చుకోవాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్, శకంతకమణి వంటి వారు వైసీపీ లోకి వచ్చి చేరారు. ఇందులో డొక్కా మాణిక్య వర ప్రసాద్ కు మళ్లీ ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ తరఫున దక్కేలా జగన్ చేశారు. మిగతా వారి విషయంలోనూ ఇదే ఫార్ములా ఉపయోగించే అవకాశం ఉండడంతో, పెద్దఎత్తున ఎమ్మెల్సీలు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు అధికార పార్టీ నాయకులతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల చేరిక విషయంలో స్పష్టత లేకపోయినా, ఎమ్మెల్సీలు మాత్రం పెద్ద ఎత్తున చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
 
 
 వీరితో పాటు నియోజకవర్గ స్థాయి బలమైన నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తుండడంతో తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు కొంతమంది  రంగంలోకి దిగి, పార్టీ మారతారు అనే అనుమానం ఉన్న నాయకులను బుజజగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: