ముందుగా తండ్రి రాజారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ వృత్తి రీత్యా డాక్టర్ అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత రాజకీయాల పట్ల ఆసక్తి తో 1978లో అప్పటి ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుండి గెలిచి, అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పని చేసారు. తరువాత కొన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికకాబడ్డ వైఎస్సార్, ఆపై కడప నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికకాబడ్డారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషిచేసిన వైఎస్ కు ఆ పార్టీలో మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత కూడా అదే పార్టీలో కొనసాగిన వైఎస్, ఆపై 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారిగా పీఠాన్ని అధిష్టించారు.
మొదటి నుండి ఇచ్చిన మాటకు కట్టుబడి, మోముపై ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ముందుకు సాగె మనస్తత్వం గల వైఎస్సార్, ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించింది మొదలు, ఏటికేడు తాము మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని, పధకాన్ని అమలుపర్చడంతో పాటు తొలిసారిగా ఆంధ్రకు రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజూ రీ ఎంబెర్స్మెంట్, 108 సేవలు తో పాటు మరికొన్ని అద్భుత పధకాలు అమలు పరిచి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అనంతరం అటు టిడిపి, టిఆర్ఎస్ సహా పలు ఇతర పార్టీలు మహాకూటమిగా ఏర్పడి, మరోవైపు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పోటీ ఉన్నప్పటికి కూడా, గత ప్రభుత్వం తరపున తాము చేపట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా ముందుకు కదిలిన వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి, మిగతా పార్టీలను వెనక్కునెట్టి మరీ 2009 ఎన్నికల్లో ప్రజలు మరొక్కసారి అధికారాన్ని కట్టబెట్టారు.
దానితో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో మరోమారు విజయం సాధించడంతో పాటు సొంతంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం మరొక్కసారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన వైఎస్, సరిగ్గా రెండు నెలల పాలన అనగా, 2009 సెప్టెంబర్ 2న ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ ఘటన ఇప్పటికీ కూడా వైఎస్సార్ అభిమానులు, తెలుగు ప్రజలు మరిచిపోలేరు. వాస్తవానికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎఎస్సార్ అనే పేరు నిజంగా ఒక ప్రభంజనం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో మేము కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మహానేత వైఎస్సార్ గారు చేపట్టిన పధకాలు, చేసిన మంచి పనులు చూసే ఆ పార్టీకి ఓటేశామని ఇప్పటికీ కూడా ఎందరో ప్రజలు చెప్తూ ఉంటారంటే అదే ఆ మహానేత గొప్పతనం, ఆయన సృష్టించిన ప్రభంజనం. నేడు ఆయన జయంతి సందర్భంగా ఒకసారి ఆ మహానేతను స్మరించుకుందాం....!!