ఏపీ ప్రభుత్వం కొలువుతీరి అప్పుడే ఏడాది దాటింది. ముఖ్యమంత్రిగా జగన్ నూటికి నూరు మార్కులు వేయించుకున్నారు. అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నా, లెక్కచేయకుండా కొత్త కొత్త పథకాలను అమలు చేస్తూ, దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా కనిపిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు జగన్ అమలు చేస్తున్న నిర్ణయాలను, పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నాయి. కరోనా సమయంలోనూ ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు కేంద్రం కూడా అభినందిస్తూ వస్తోంది. జగన్ వరకు ఈ విధంగా సక్సెస్ అయినా, జగన్ మంత్రి మండలి గురించిన చర్చ ఇప్పుడు మొదలైంది.
ఏడాది కాలంలో ఏపీ మంత్రుల పనితీరు ఎలా ఉంది ? జగన్ నమ్మకాన్ని నిలబెట్టాడా ? ప్రజల్లో ఎంత వరకు బలం పెంచుకున్నారు ? ప్రభుత్వ పథకాలను ,జగన్ నిర్ణయాలను, తమకు అప్పగించిన బాధ్యతలను వారు ఎంత వరకు సక్సెస్ చేయగలుగుతున్నారు అనే అన్ని అంశాలపై చర్చ జరుగుతోంది.జగన్ మంత్రి మండలి మొత్తం అన్ని సామాజిక వర్గాల సమతూకం గానే ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వారికి సమ ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవంగా జగన్ క్యాబినెట్ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారని, అందరూ అనుకున్నారు. కానీ జగన్ మాత్రం నలుగురు కాపులతో పాటు నలుగురు బీసీలకు మంత్రి పదవులు కేటాయించారు. ఇంత వరకు బాగానే ఉన్నా మంత్రుల పనితీరు పై జనాల్లో మాత్రం అంతగా సంతృప్తి లేదనే విషయం బయటకు వస్తుంది.
చాలా మంది మంత్రులు సొంతంగా పార్టీకి క్రెడిట్ తీసుకొచ్చే విధంగా, ప్రభుత్వానికి మైలేజ్ తీసుకువచ్చే విధంగా వ్యవహరించలేకపోతున్నారు అని, కేవలం జగన్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు మాత్రమే మంత్రులు ముందుకు వస్తున్నారు తప్ప, సొంతంగా తమకు అప్పగించిన శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని , కేవలం జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకే వారు తాపత్రయపడుతున్నారు అనే అపవాదు ఎదుర్కుంటున్నారు.