దేశంలో కరోనా బాధితుల సంఖ్య పదుల నుంచి వేలల్లోకి కరోనా మృతుల సంఖ్య పదుల నుంచి వందల్లోకి చేరింది. రెండో విడత లాక్ డౌన్ సడలింపుల తర్వాత నమోదవుతున్న కేసుల సంఖ్య వింటేనే ప్రజలు ఆందోళన పడాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల వరకు వందకు అటూఇటుగా తెలుగురాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా ప్రస్తుతం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 1,800కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తల గురించి సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి స్పందిస్తే మాత్రమే సమాధానం దొరికే అవకాశం ఉంది. అయితే కారణాలు తెలియవు కానీ గత కొన్ని రోజులుగా కేసీఆర్ మీడియాకు దూరంగా ఉన్నారు. 
 
అయితే నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తాజాగా హైకోర్టులో వేసిన పిటిషన్ చర్చకు దారి తీస్తోంది. పిటిషన్ ద్వారా కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తెలియాలని... ఆయన ప్రజల ముందుకు రావాలని పేర్కొన్నారు. అయితే కోర్టు ఈ పిటిషన్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేము. కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో ధైర్యం పెంచారు. కానీ ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉన్నారు. 
 
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం సైతం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలకు సంబంధించి, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్సలకు సంబంధించి రకరకాల ఫిర్యాదులు వెల్లువత్తుతున్నాయి. తీన్మార్ మల్లన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వేసిన చిత్రమైన పిటిషన్ లాంటిది కాకుండా ప్రజలకు ప్రయోజనం చేకూరే పిటిషన్లు వేస్తే బాగుంటుందని కొందరు నెటిజన్లు కామెంట్లు.చేస్తున్నారు. పాపులారిటీ కోసమే ఇలాంటి అనవసరమైన పిటిషన్లను వేస్తున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పిటిషన్ తర్వాతైనా కేసీఆర్ మీడియా ముందుకు వస్తారా...? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: