దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. గత నాలుగు నెలలుగా వైరస్ వల్ల దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే ఈ వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఇటలీ శాస్త్రవేత్తలు గర్భిణుల నుంచి గర్భస్థ శిశువులకు వైరస్ సంక్రమించే వీలుందని చెబుతున్నారు. 
 
అందువల్ల గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.... వైద్యుల సూచనలను బట్టి నడుచుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించిన రోజు నుంచి గర్భస్థ శిశువులకు వైరస్ సోకుతుందా....? లేదా....? అనే అంశం గురించి విసృతంగా చర్చలు జరిగాయి. కొన్ని వైరస్ లు తల్లి నుంచి గర్భస్థ శిశువుకు సోకుతుండగా కొన్ని వైరస్ లు మాత్రం వ్యాప్తి చెందడం లేదు. జికా, హెచ్.ఐ.వీ లాంటి వైరస్ లు తల్లి నుంచి శిశువుకు సోకుతున్నాయి. 
 
గతంలో చైనాలో చేసిన పరిశోధనల్లో తల్లి నుంచి శిశువుకు కరోనా సోకుతుందని వెల్లడైంది. అయితే పరిశోధకులు ప్రసవ సమయంలో లేదా అనంతరం బిడ్డకు వైరస్ సోకుతుందని భావించారు. కానీ తాజాగా కరోనా సోకిన 31 మందిపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో కాన్పు అయిన వీళ్ల బొడ్డు రక్తం, మాయ, స్తన్యంలలో వైరస్ ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
అయితే మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని... వైరస్ సోకుతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు. న్యూయార్క్ లోని పరిశోధకులు మాత్రం తల్లి నుంచి బిడ్డాకు కరోనా వైరస్ చాలా అరుదుగా జరుగుతుందని అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి.        

మరింత సమాచారం తెలుసుకోండి: