ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణాల్లో తొలి విడ‌తను మాఫీ చేసేందుకు సిద్ధమైంది. సీఎం జగన్ గతంలో 4 విడతలుగా రుణాలను మాఫీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా తాజాగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. 
 
కరోనా కష్టకాలంలోను సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్ ఆస‌రా ప‌థ‌కం కింద డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణాల్లో తొలి విడ‌తను ప్రభుత్వం సెప్టెంబ‌ర్ 11వ తేదీన చెల్లించనుందని తెలుస్తోంది. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని 9 ల‌క్ష‌ల 33 వేల సంఘాల స‌భ్యులకు రూ.27,168 కోట్ల రుణం ఉన్న‌ట్లు అధికారుల లెక్కల్లో తేలింది. తొలి విడతగా ప్రభుత్వం 6,792 కోట్ల రూపాయలు చెల్లించనుంది. 
 
ప్రభుత్వం మాఫీ చేసిన సొమ్మును నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలలో జమ చేయనుందని సమాచారం అందుతోంది. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయనుంది. జగన్ సర్కార్ ఇందుకోసం వారికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను సేక‌రిస్తోంది. ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని తెలుస్తోంది. జగన్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉండటం పట్ల డ్వాక్రా మహిళలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు ప్రభుత్వం వైయస్సార్ జయంతి సందర్భంగా ఈ నెల 8న ఇళ్లపట్టాలను పంపిణీ చేయాల్సి ఉన్నా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని 20 లక్షల మందికి ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను పంచాల‌ని సంకల్పించింది. ఆగష్టు 15వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: