ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం తాజాగా విడుదల చేసిన నివేదికలో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అదేంటంటే పర్యావరణం రోజురోజుకీ క్షీణించి పోవడం వలన జూనోటిక్ వ్యాధులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయని తెలిపింది. జూనోటిక్ వ్యాధులు అనగా... జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులు. కొవిడ్-19, హెచ్ఐవి, ఎయిడ్స్, ఎబోలా వంటి ప్రాణాంతకమైన జూనోటిక్ రోగాలు తరచుగా విజృంభించడానికి కారణం జంతువుల మాంసం లోని ప్రోటీన్ల కోసం మనుషుల డిమాండ్ పెరగడం అని, డిమాండ్ కి తగినట్లుగా సరఫరా చేసేందుకు జంతు వ్యాపారులు ఇష్టారాజ్యంగా కలుషితాలు వాడటమని, అలాగే మనుషుల డిమాండ్ వలన వన్య ప్రాణులను కూడా చంపడం అని, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ కోసం పర్యావరణాన్ని నాశనం చేయడం అని ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రోగ్రాం వెల్లడించింది.


'మనం వన్యప్రాణులను అంతం చేస్తూ, మన పర్యావరణ వ్యవస్థలను కూడా నాశనం చేస్తూ ఉంటే, రాబోయే సంవత్సరాల్లో ఈ జూనోటిక్ వ్యాధులు జంతువుల నుండి మానవులకు విపరీతంగా సంక్రమించడం మనం చూస్తాం', అని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యనిర్వాహక డైరెక్టర్ ఇంగెర్ అండర్సన్ చెప్పుకొచ్చారు.


ప్రభుత్వాలు పర్యావరణాన్ని రక్షించడానికి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వంటివి ఇంకా ఎన్నో ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తాయని, వన్యప్రాణులను సంరక్షించకపోతే ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని... అందుకే తాము సూచించిన 10 మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ నివేదికలో పేర్కొన్నది.


ఇకపోతే మానవులు తమ స్వప్రయోజనాల కోసం పర్యావరణాన్ని నాశనం చేస్తూ వన్యప్రాణులను చంపేయడం వలన భావితరాల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉంటుందని, ఒక్క కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని ఐక్యరాజ్యసమితి గుర్తు చేసింది. ఏదేమైనా ప్రకృతిని మనం సంరక్షిస్తే అది మనల్ని తప్పకుండా కాపాడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని జీవనం సాగిస్తే బాగుంటుందని ఐక్యరాజ్యసమితి గొంతు చించుకొని మరీ చెప్తుంది.










Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: