ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను ఈరోజు ఉదయం పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పోలీసులు వికాస్ దూబేను అరెస్ట్ చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కాన్పూర్ కు వికాస్ ను తీసుకెళ్లే సమయంలో మార్గమధ్యంలో వాహనం బోల్తా కొట్టింది. ఆ సమయంలో వికాస్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతనిని కాల్చి చంపారు. 
 
కొన్ని రోజుల క్రితం ఎనిమిది మంది పోలీసులను వికాస్, అతని గ్యాంగ్ హత్య చేసింది. దీంతో పోలీసులు అతనిపై పగబట్టారు. పోలీసులు గత ఐదు రోజుల్లో వికాస్ గ్యాంగ్ లోని పలువురిని కాల్చి చంపారు. వికాస్ దూబే ఎన్ కౌంటర్ విషయంలో పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మనమంతా వికాస్ దూబే మరణం నేర్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో సినిమాల ప్రభావమో ఇతర ప్రభావమో తెలీదు కానీ యువతలో చాలామంది రెబల్ మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారు. 
 
తాము చెప్పిందే వేదం అని భావిస్తూ గొడవలు పడటానికి, రౌడీయిజం ప్రదర్శించడానికి ఆకర్షితులవుతున్నారు. వికాస్ ఎన్ కౌంటర్ అలా తయారవుతున్న యువతరానికి పెద్ద పాఠం అనే చెప్పాలి. తుపాకులు, కర్రలు, కత్తులు పట్టుకోవడం ఎప్పటికీ శ్రేయస్కరం కాదు. ఎదుటివాళ్లపై ఆధిపత్యం చలాయించాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు. రౌడీయిజం, గూండాయిజం చేసి పైకి రావాలనుకునే వాళ్లకు శత్రువుల సంఖ్య పెరుగుతుంది. 
 
వికాస్ దూబే మొదట సమాజ్ వాదీ పార్టీలో లోకల్ కార్యకర్త. ఆ తరువాత ఎదిగే క్రమంలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో చేరి రౌడీయిజం చేసేవాడు. ఆ తరువాత అక్కడ సెటిల్మెంట్లు చేసి లీడర్ గా ఎదిగాడు. అనంతరం ఆయుధాలు సమకూర్చుకుని అహాన్ని ప్రదర్శించసాగాడు. వికాస్ దూబేను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా పోలీసులపైనే కాల్పులు జరిపి వార్తల్లో నిలిచాడు. చివరకు నేడు పోలీసుల చేతిలో బుల్లెట్లకు బలి అయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: