నమ్మిన వారి కోసం.. తనను నమ్ముకున్న వారి కోసం ఎక్కడ వరకు అయినా, ఏం చేసేందుకైనా జగన్ వెనకడుగు వేయరు అనేది ఆయనను మొదటి నుంచి అనుసరిస్తున్న వారికి బాగా తెలుసు. 2019 ఎన్నికల్లో జగన్ ను నమ్ముకున్న వ చాలామందికి ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కలేదు. ఆ సమయంలో వారికి ఎమ్మెల్సీ పదవి కానీ, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కానీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అటువంటి హామీనే చిలకలూరిపేట వైసీపీ మాజీ ఇంచార్జి మర్రి రాజశేఖర్ కు జగన్ ఇచ్చారు. 2019 వరకు పార్టీకి అన్నివిధాలుగా అండగా ఉంటూ, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా ఇక టికెట్ దక్కడమే తరువాయి, ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోదామని భావించిన మర్రి రాజశేఖర్ ను అనూహ్యంగా జగన్ పక్కన పెట్టి, అప్పుడే టిడిపి నుంచి వచ్చి చేరిన విడదల రజిని కి అవకాశం కల్పించారు .
దీంతో అసంతృప్తికి గురైన మర్రి రాజశేఖర్ ను బుజ్జగించేందుకు జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసే అవకాశం ఉండడంతో మర్రి రాజశేఖర్ ఈ దఫా తనకు ఎమ్మెల్సీ రావడం ఖాయం అయిపోయింది అని ప్రచారం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని రాజశేఖర్ దూకుడు బ్రేకుల వేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆమె పార్టీలో చేరిన దగ్గర నుంచి ఎమ్మెల్యే అయిన తరువాత, ఇప్పుడూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. చిలకలూరిపేట లో రెండో ప్రత్యామ్నాయం ఉంటే తన రాజకీయ భవిష్యత్తును ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో, ఆమె మర్రి రాజశేఖర్ కు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ, మంత్రి పదవి రేసులో తాను ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారు.
అలాగే మొదటి నుంచి ఆమె సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటూ, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి కన్ఫామ్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో, జగన్ ఆమె ఆశలు తీరుస్తారా లేక మొదటి నుంచి తనను నమ్ముకుని ఉన్న మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ గా ఎంపిక చేసి న్యాయం చేస్తారా అనేది తేలాల్సి ఉంది. మర్రి రాజశేఖర్ కు కనుక ఎమ్మెల్సీ పదవి ఇస్తే రజినీకి మంత్రి పదవి ఇచ్చే అవకాశమే లేదనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తం అవుతుండగా, రజిని వర్గం మాత్రం ఈ దఫా మంత్రి పదవి తమకే దక్కుతుందని, పార్టీకి కి మైలేజ్ తీసుకువచ్చే విధంగా చేయడంతో పాటు, రాజకీయ ప్రత్యర్ధి అయిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వంటివారు నోరెత్తకుండా చేయగలిగారు అని చెబుతున్నారు. జగన్ మరి ఈ ఇద్దరి విషయం ఏవిధంగ వ్యవహరిస్తారో చూడాలి.