చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా తయారైంది బీజేపీ పరిస్థితి. మొదటి నుంచి వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన బిజెపి, జగన్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను, నిర్ణయాలను సమర్థిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవారు. కానీ కొద్ది రోజులుగా బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 2024లో బీజేపీ జెండా రెపరెపలాదించాలి అనే ఆకాంక్ష బీజేపీ లో ఎక్కువ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే, ఏపీ ప్రభుత్వాన్ని అడుగడుగున ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ, తాము క్రెడిట్ సాధించాలనే అభిప్రాయంతో ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. జగన్ అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాల్లో కేంద్ర పథకాలు ఉన్నాయని, కానీ వాటి పేర్లు మార్చి జగన్ అమలు చేస్తున్నారని, బిజెపికి క్రెడిట్ రాకుండా అడ్డుకుంటూ, కనీసం ఆ పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కూడా వాడకుండా మొత్తం క్రెడిట్ అంతా వైసీపీ కొట్టేస్తోందని బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది.
తాజాగా చిరు వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా పదివేల వరకు రుణాలు ఇచ్చే జగనన్నకి తోడుగా అనే పథకం ప్రవేశపెట్టారని, కానీ దీనికి కేంద్రం నిధులు ఇస్తోందని, లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులకు గురవుతున్న వారిని ఆదుకునే నిమిత్తం కేంద్రం ఆత్మ నిర్భర ప్యాకేజీలో భాగంగా, పీఎం స్వానిధి పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని, కానీ ఏపీలో ఆ పథకం కాస్తా జగనన్న తోడుగా మారిపోయింది అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు విమర్శలు మొదలుపెట్టారు. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తాము కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటూ జగన్ స్టిక్కర్ సీఎం గా మారిపోయాడు అంటూ విమర్శలు చేస్తోంది.
అలాగే పీఎం కిసాన్ యోజన వంటి పథకాలను, ఏపీలో రైతు భరోసా పేరుతో అమలు చేస్తున్నారు అని, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అని, కేంద్రమే నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్ములు వేస్తున్నా, ఆ క్రెడిట్ కేంద్రానికి రాకుండా చేస్తున్నారని బిజెపి విమర్శలు చేస్తోంది. అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అమలు అవుతుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఆ క్రెడిట్ కేంద్రానికి ఇస్తే, మరికొన్ని రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగానే వాటిని అమలు చేస్తూ ఉంటాయి. ఇందులో ఏపీ ప్రభుత్వం తప్పు చేసిందాా లేదా అనేే విషయాన్ని పక్కన పెట్టేస్తే, జగన్ కు రావలసిన క్రెడిట్ అంతా వచ్చేసిన తర్వాత తీరిగ్గా ఆ పథకాలుు మావి అంటూ నెత్తి నోరు బాదుకుంటే ప్రయోజనం ఏంటి అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.