ఏపీ సీఎం జగన్ తరచూ ఓ మాట అంటుంటారు.. ఈ చెడిపోయిన రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోంది అని.. 2014లో తన పార్టీ నుంచి గెలిచిన దాదాపు 23 మందిని చంద్రబాబు లాగేసుకుని.. వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చినప్పుడు జగన్ మొదటిసారి ఈ డైలాగ్ కొట్టారు. ఆ తర్వాత అనేక వేదికలపై ఇదే మాట పలుసార్లు అన్నారు.
అందుకే జగన్ అప్పుడే ఓ శపథం చేశారు. వైసీపీలోకి వేరే పార్టీ వాళ్లు రావాలంటే.. ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులు వదిలేసి రావాల్సిందేనని.. ఇప్పటి వరకూ అదే రూల్ ఫాలో అవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి వంటి వారు టీడీపీ నుంచి వైసీపీ పక్షాన మారినా.. వారిని ఇంకా పార్టీలో చేర్చుకోలేదు. అంటే వారు టెక్నికల్ గా టీడీపీలో ఉంటూనే అదే పార్టీని చెడుగుడు ఆడుతుంటారన్నమాట.
అయితే.. జగన్ చెప్పినట్టు టీడీపీ నుంచి వచ్చిన పదవిని వదిలేసి.. మళ్లీ వైసీపీలో అదే పదవి అందుకున్న తొలి వ్యక్తిగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రికార్డు సృష్టించారు. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా గతంలో ఎన్నికైన ఆయన... మండలిలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇప్పుడు తాను రాజీనామా చేసిన స్థానానికే మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఇలా వేరే పార్టీలో తాను రాజీనామా చేసిన స్థానానికే... వైసీపీలో చేరాక మళ్లీ పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి డొక్కా. శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని చూడటం బాధ కలిగించిందని.. అందుకే తాను రాజీనామా చేశానని డొక్కా మాణిక్య వరప్రసాద్ చెబుతున్నారు. మండలి అంటే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేలా ఉండాలని... మండలి చైర్మన్‌కు కొందరు తప్పుడు గైడెన్స్ ఇచ్చారని డొక్కా అంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా తాను సభకు ఆబ్సెంట్ అవ్వలేదని డొక్కా తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న సభ నిర్ణయాలను గౌరవించాలని ఈ ఎమ్మెల్సీ సూచించారు.