తాము ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా, మొన్నటి వరకు తెలంగాణలో రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ ఉండేది టిఆర్ఎస్. ఆ పార్టీకి ఎదురే లేకుండా ఉండేది. తెలంగాణలో కాంగ్రెస్ ను క్రమక్రమంగా బలహీనం చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. దీంతో తమ నిర్ణయాలకు అడ్డు చెప్పేవారు పెద్దగా కనిపించలేదు. కానీ అనూహ్యంగా తెలంగాణలో బిజెపి బలపడడం, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కొన్ని స్థానాలు దక్కించుకోవడంతో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వంటి కారణాలతో దూకుడుగా ఉంటూ వస్తోంది. తెలంగాణలో ఆ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కొత్త అధ్యక్షుడిని నియమించింది అధిష్టానం. దీంతో బీజేపీ దూకుడు తగ్గించడం ఎలా అనే విషయంపై కేసీఆర్ దృష్టిపెట్టారు. కానీ బీజేపీ మాత్రం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లేలా, బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది.
తెలంగాణ బిజెపి ఎంపీలు అయిన బండి సంజయ్ , ధర్మపురి అరవింద్ యువకులు కావడం, ప్రతి విషయంలోనూ టీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతుం డడం వంటి పరిణామాలు కేసీఆర్ కు మింగుడు పడడం లేదు. అందుకే రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది బిజెపి ఎంపీ అరవింద్ పై దాడి చేసేందుకు ప్రయత్నించడం, ఆ సందర్భంగా పెద్ద రాద్దాంతం జరగడం వంటి పరిణామాలు కేసీఆర్ ను ఆందోళనకు గురి చేశాయి .ఈ నేపథ్యంలో బిజెపి దూకుడు ఎక్కువైందని, గతంలో కాంగ్రెస్ బలంగా ఉన్న సమయంలో తమకు ఇంత ఇబ్బంది రాలేదనే అభిప్రాయానికి వచ్చిన కేసీఆర్ బీజేపీ దూకుడు తగ్గించేందుకు, కాంగ్రెస్ అస్త్రాన్ని బయటకు తీసినట్టుగా కనిపిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు అంతకు ముందు వరకు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనట్టు గా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ విమర్శలకు వెంటనే స్పందిస్తూ , హడావుడి చేస్తున్నారు . అదే సమయంలో బిజెపి చేస్తున్న విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ ప్రాధాన్యం పెంచి బీజేపీనీ ఎదగకుండా చేయడంతోపాటు, అనవసరంగా బిజెపి చేసిన విమర్శలకు స్పందిస్తే, ఆ పార్టీ హైలెట్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ ను హైలెట్ చేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ధర్నాలు, ఆందోళనలు అంటూ కాంగ్రెస్ చేసే కార్యక్రమాలకు, అనుమతులు కూడా సులువుగా ఇచ్చే విధంగా అధికారులకు అనధికారికంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని వల్ల బిజెపి దూకుడుకు చెక్ పెట్టాలన్నదే కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది.