రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు సహజమే. అయితే ఆ ఎత్తులన్నీ రాజకీయాల వరకే.. వ్యక్తిగతంలోకి వస్తే.. పార్టీలు చూసేది లేదని నిరూపించారు కర్ణాటకలోని ఓ ప్రేమ జంట. కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని అఫజలపుర్ తాలూకా పంచాయతీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ పెళ్లి చేసుకుని రాజకీయాలకు అతీతం తమ ప్రేమ అని నిరూపించారు.
వివరాల్లోకి వెళ్తే.. చౌడాపుర తాలుకా పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ తరపున రుక్మిణి జమాదార గెలిచింది. పక్కనే ఉన్న కరజగి తాలుకా పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భీమాశంకర్ గెలిచారు. ఇక అఫజలపుర్ తాలుకా పంచాయితీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో అధ్యక్షురాలిగా రుక్మిణి ఎన్నికైతే... ఉపాధ్యక్షుడిగా భీమాశంకర్ నెగ్గారు. వేరే పార్టీల్లో ఉన్నా... రుక్మిణి, భీమాశంకర్ మధ్య ప్రేమ చిగురించింది.
పార్టీలు వేరే అయినా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమకు పెద్దలూ అడ్డుచెప్పలేదు. అంతా సాఫీగానే సాగింది. ఇంతలో పోలీసులు వచ్చి వీరిపై కేసు పెట్టేశారు. అదేంటి వేరు వేరు పార్టీల వారు పెళ్లి చేసుకుంటే కేసు పెడతారా అని ఆశ్చర్యపోకండి.. వారు కేసు పెట్టింది అందుకోసం కాదు.. వాళ్లు తమ పెళ్లి రిసెప్షన్‌ను కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా గ్రాండ్ గా చేసుకున్నందుకు.
అంతే కాదు.. ఈ పెళ్లి, రిసెప్షన్‌లలో ఎక్కడా కనీసం కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఒక్కరు కూడా మాస్క్ కట్టుకున్న పాపానపోలేదు. స్వయంగా ప్రజాప్రతినిధులైన వీరు ప్రజలకు కరోనా గురించి వివరించి జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి.. వారే రూల్స్ పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు పోలీసులు కేసు పెట్టేశారు. అఫజల్ పుర్ తాలుకా పంచాయితీ అధ్యక్షరాలు రుక్మిణి, ఉపాధ్యక్షుడు భీమాశంకర్ ల వివాహం రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవడానికి మాత్రమే తాము అనుమతి ఇచ్చామని కలెక్టర్ చెబుతున్నారు. ప్రజాప్రతినిధులైనా రూల్ అంటే రూలే కదా మరి.