ఇండో- చైనా మధ్య చర్చలు ఒకడుగు ముందుకు, నాలుగడుగుల వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి. కీలక అంశాలపై డ్రాగన్ మొండిపట్టుతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంటోంది. తాజాగా జరిగిన కోర్ కమాండర్ స్థాయి చర్చలు మరోసారి అర్ధాంతరంగా ముగిసాయి. సుదీర్ఘ సమావేశంలో ఎలాంటి అవగాహనకు రాలేకపోయాయి.
లడ్డాఖ్ సమీపంలో నెలకొన్న వివాదాలు, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి భారత్-చైనా మధ్య ఆరంభమైన చర్చలు మరోసారి అర్ధాంతరంగా ముగిశాయి. సుమారు 15 గంటల పాటు కొనసాగిన చర్చల వల్ల ఎలాంటి ఫలితమూ రాలేదు.
భారత్-చైనాకు చెందిన ఆర్మీ లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఆరంభమైన చర్చలు బుధవారం తెల్లవారుఝామున 2 గంటల వరకూ అంటే.. సుమారు 15 గంటల పాటు కొనసాగాయి. భారత భూభాగంపైనున్న ఛుసుల్ దీనికి వేదికైంది. భారత్ తరఫున 14 కార్ప్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా వైపు గ్జిన్‌జియాంగ్ మిలటరీ రీజియన్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయినా ఎలాంటి ఫలితమూ రాకపోవడానికి చైనా వైఖరే కారణమని తెలుస్తోంది.
చైనా సైనికులు వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వంటి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను ఖాళీ చేశారు. వ్యూహాత్మకంగా రెండు దేశాలకూ కీలకమైన, సున్నతమైన పాంగ్యాంగ్ త్సొ, డెప్సాంగ్ ప్లెయిన్ ప్రాంతంలో చైనా సైనిక శిబిరాలు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని ఖాళీ చేయాలంటూ భారత ఆర్మీ అధికారులు చేసిన డిమాండ్లకు చైనా అంగీకరించలేదు.
సరిహద్దు వివాదాలపై ఈ రెండు దేశాల మధ్య ఇప్పటిదాకా లెప్టినెంట్ కమాండర్ స్థాయి సైనికాధికారుల మధ్య నాలుగు దశల్లో చర్చలు ముగిసినట్టయింది. ఇందులో ఏ ఒక్కటి కూడా ఫలితాలను ఇవ్వలేదు. ఇదే అంశంపై ఐదో విడత కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.