మామూలుగా పోలీస్ తనిఖీల్లో భారీగా డబ్బులు బయట పడ్డాయి అంటే సంచలనం గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అదే ఒక మంత్రి కి సంబంధించిన వాహనంలో భారీగా నగదు బయట పడితే అది ఇంకెంత  సంచలనంగా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా తమిళనాడు తిరువల్లూరు సమీపంలో ఇలాంటి ఘటన జరిగింది. తిరువల్లూరు సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అక్కడికి వచ్చిన ఓ వాహనాన్ని అడ్డగించి వాహనంలో తనిఖీలు నిర్వహించగా భారీగా నగదు తో పాటు బంగారాన్ని కూడా గుర్తించారు పోలీసులు. అయితే ఆ వాహనం ఆంధ్రప్రదేశ్ మంత్రి కి సంబంధించింది అంటూ ప్రచారం జరిగింది.




 కాగా సదరు వాహనానికి ఎలాంటి అనుమతి లేకుండానే అక్రమంగా రాష్ట్రం లోకి వచ్చేందుకు  ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారని తమిళనాడు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా వాహనంలో  కోటి రూపాయల నగదుతో పాటు భారీగా బంగారు ఆభరణాలు కూడా గుర్తించారు పోలీసులు. ఇక ఈ డబ్బు బంగారం ఎక్కడిది అంటూ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించగా ముగ్గురు వ్యక్తులు కూడా తెల్లమొహం వేసారు, పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఈ ముగ్గురు నిందితుల్లో ఇద్దరూ ఒంగోలుకు చెందిన వారు కాగా చిలకలూరిపేట కు చెందిన వారు ఒకరు ఉన్నారు. సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు.



అయితే ఈ కారు పైన ఆంధ్రప్రదేశ్ విద్యుత్,  అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  కి సంబంధించిన స్టిక్కర్ ఉండడంతో.. ఈ వాహనం మంత్రిదే అంటూ ప్రచారం జరిగింది.  ఈ విషయంపై మంత్రి బాలినేని స్పందించారు. ఆ  కార్లో  ఒంగోలుకు చెందిన వ్యక్తి ఉండడంవల్ల ఆ వాహనం కూడా ఒంగోలు ఎమ్మెల్యేది  అని అందరూ అనుకుంటున్నారు అని... కానీ వాస్తవానికి ఆ కారు మీద ఉన్న స్టిక్కర్ జిరాక్స్ తీసి అంటించారని.. ఆ వాహనానికి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి బాలినేని.కాగా  ఈ కేసుని చెన్నై ఐటీ శాఖ ముఖ్య కమిషనర్ అనిల్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. భారీ మొత్తంలో ఈ వాహనంలో నగదు బంగారం దొరకడం సంచలనంగా మారిన నేపథ్యంలో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: