అది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఓ ప్రభుత్వాసుపత్రి.. నిజాం రాజులు కట్టించిన దవాఖానా.. పేదల పాలిట పెన్నిధి.. హైదరాబాద్, చుట్టుపక్కల పేదలందరికీ అది ఓ ఆరోగ్య ఆలయం.. అలాంటి ఆలయం పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ఎన్నిసార్లు పత్రికల్లో కథనాలు వచ్చినా ఈ దవాఖానా గురించి పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు.
అదే ఉస్మానియా ఆసుపత్రి.. ఈ ఆసుపత్రిలో 500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. 400 మంది దాకా రోగులు చికిత్స పొందుతున్నారు. అసలే ఎప్పుడు పై పెచ్చులు ఊడిపడతాయో తెలియని స్థితిలో ఉన్న ఈ ఆసుపత్రి రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరీ దారుణంగా తయారైంది.
అసలే కరోనా రోగులు ఓవైపు.. మరోవైపు మురుగునీటి ఇబ్బంది మరోవైపు.. వర్షపు నీటితో వార్డులు పూర్తిగా చెరువుల్లా మారిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షపు నీరు మోకాల్లోతు వరకు వార్డుల్లోకి చేరింది. రోగులు, వారి సహాయకులతో పాటు వైద్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
చివరకు కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం తెచ్చి పీపీఈ కిట్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పుడే కాదు.. ప్రతి ఏటా వానాకాలంలో ఈ ఇబ్బందులు తప్పవు. గతంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కమిటీలు వేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు.