దేశం కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుంది. ప్రజలు వైరస్ పేరు వినిపిస్తేనే భయాందోళనకు గురవుతున్న సమయంలో బ్రిటన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు శుభవార్త చెప్పారు. తొలి దశ ప్రయోగాల్లో వ్యాక్సిన్ కరోనా వైరస్ విషయంలో రెట్టింపు రక్షణ ఇస్తుందని తెలిపారు. 
 
వ్యాక్సిన్ ను తీసుకున్న వాలంటీర్ల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ను పరిశీలించి వ్యాక్సిన్ శరీరంలో కరోనాను నిరోధించే యాంటీ బాడీలను ఉత్పత్తి చేయడంతో పాటు వైరస్ ను అంతం చేసే టి కణాలను సైతం ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. సాధారణంగా వ్యాక్సిన్ ద్వారా శరీరంలో చేరిన యాంటీ బాడీలు కొన్ని నెలల వరకు మాత్రమే మనకు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే టి కణాలు మాత్రం సంవత్సరాల పాటు శరీరంలో ఉంటాయి. 
 
టి కణాల వల్ల రాబోయే కొన్ని సంవత్సరాల వరకు వైరస్ భారీన పడే అవకాశాలు అరుదుగా ఉంటాయి. అయితే ఆక్స్‌ఫర్డ్ పరీక్ష ఫలితాలు సానుకూలంగానే ఇప్పటివరకు తొలి దశ ప్రయోగాలు మాత్రమే పూర్తి కావడంతో వైరస్ ను వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో నియంత్రిస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ మంచి ఫలితాలే ఇస్తున్నా ప్రజలకు అందుబాటులోకి రావడానికి చాలా సమయమే పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
పరిశోధకులు కొన్ని సందర్భాల్లో అనూహ్య పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని... సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం, ఆస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్ టీకాను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.                      

మరింత సమాచారం తెలుసుకోండి: