తెలుగుపత్రిక రంగంలో ఎన్నో పత్రికలు పుట్టాయి.. గిట్టాయి.. కొన్ని కొనసాగుతున్నాయి. అయితే కొన్ని పత్రికలు కొంతకాలమే అయినా సంచలనం సృష్టించాయి. పదునైన కథనాలతో ప్రత్యర్థి ప్రతికల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. 1985లో దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న ఉదయం కూడా అంతే. ఉదయం పత్రిక మొదలైన కొన్నిరోజులకే ప్రకాశం జిల్లాలో కారంచేడు ఊచకోత ఘటన జరగడం.. దాన్ని ఉదయం అద్భుతంగా కవర్ చేయడం తెలుగు పాత్రికేయ చరిత్రలో ఓ కీలక ఘట్టం.
అప్పట్లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. తెలుగు దేశం అధికార పీఠం అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈనాడు ఆయనకు అనుకూలంగా ఉండేది. ఇదే సమయంలో దాసరి నారాయణరావు ఏబీకే ప్రసాద్, రామచంద్రమూర్తి, తాడి ప్రకాశ్ వంటి వారితో ఉదయం ప్రారంభించారు. ఆయన పాత్రికేయులకు మంచి స్వేచ్ఛ ఇచ్చారు. అప్పడే జరిగింది కారంచేడు ఘటన.
కారంచేడు ఘటనలో దళితులను కమ్మ కులస్తులు దారుణంగా ఊచకోత కోశారు. వేలాది మంది దళితవాడపై దాడి చేసిన వారిని వెంటాడి, వేటాడారు.. అత్యంత పాశవికంగా నరికేశారు. ఆంధ్రప్రదేశ్ ను కుదిపేసిన ఈ ఘటనలో ఆరుగురు దళితులు చనిపోయారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడి వెనుక ఉన్నది కమ్మ కులస్తులు. అందులోనూ సూత్రధారిగా చెప్పబడిన దగ్గుబాటి చెంచురామయ్య అప్పటి సీఎం ఎన్టీఆర్ వియ్యంకుడు.
అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఈ ఘటనను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఉదయం పత్రిక.. "పంటపొలాల్లో పులిచంపిన లేడి నెత్తురు" శీర్షికతో బాంబులా పేల్చింది. ఘటన జరిగిన రోజు నుంచి వరుసగా కొన్ని నెలలపాటు ఈ ఘటన పరిణామాలను కవర్ చేసింది. పదునైన సంపాదకీయాలతో దళితులపై హత్యాకాండను అక్షర శస్త్రాలతో చీల్చి చెండాడింది. ఈ కారంచేడు ఘటనలో ఉదయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఉవ్వెత్తున ఎగసింది. ఆనాటి ఉదయం పత్రిక న్యూస్ ఎడిటర్ తాడి ప్రకాశరావు ఆనాటి తన అనుభవాలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.