టీవీ9.. తెలుగు మీడియాలో అది ఓ సంచలనం.. దాదాపు 17 ఏళ్ల క్రితం మొదలైన ఆ సంచలనం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగునాట మూస జర్నలిజాన్ని పాతి పెట్టి దృశ్యాన్నీ, రాతను పరుగులు పెట్టించిన ఒరవడి అది. అందుకే టీవీ9 ఇన్‌స్టాంట్ సక్సస్ అయ్యింది. అసలు 24 గంటలూ న్యూస్ ఇస్తే ఎవడు చూస్తాడు అనే రోజుల్లో టీవీ9 పుట్టింది. ఆ తర్వాత అదే బాటలో ఎన్నో చానళ్లు పుట్టుకొచ్చినా టీవీ9 నెంబర్ వన్ స్థానం మాత్రం పదిలంగానే ఉంది.
కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. బ్రాండ్ నేమ్ ఒక్కటే మిగులుతోంది. టీవీ9 ను అంతెత్తున నిలబెట్టిన వారందరూ ఒక్కొక్కరూ నిష్క్రమిస్తున్నారు. అసలు ఆ సంస్థకు పెద్ద దిక్కుగా , క్రియేటర్ గా.. దిక్సూచిగా నిలిచిన రవిప్రకాశే టీవీ9 అమ్మకం తర్వాత నిష్క్రమించారు. ఆ తర్వాత ఆయన టీమ్ గా పేరున్న ఒక్కొక్కరినీ కొత్త యాజమాన్యం పంపేస్తోంది. ఒకప్పుడు టీవీ9కు మూల స్థంభాలుగా నిలిచిన ఎందరో ఇప్పుడు ఆ సంస్థలో లేరు.
అయినా టీవీ9 నడుస్తూనే ఉంది. ఇప్పటికీ టీవీ ఛానళ్లలో తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎందుకంటే అదే బ్రాండ్ వ్యాల్యూ.. ఈ మార్పులన్నీ సాధారణ ప్రేక్షకుడికి అర్థం కావు కదా.. వాళ్లకు తెలిసిందొక్కటే న్యూస్ అంటే టీవీ9.. అలాగని.. టీవీ9 ఇదే ప్రభ కొనసాగించ గలుగుతుందా.. తన స్థానం నిలబెట్టుకుంటుందా.. అంటే సందేహమే. ఒకప్పుడు ఆ ఛానల్ కు రాజకీయపరమైన పాలసీలు అంటూ పెద్దగా లేవు. కానీ ఇప్పుడు కొత్త యాజమాన్యం ఆసక్తుల కారణంగా అలాంటి పరిస్థితి లేదు.
ఇప్పటికీ రజినీకాంత్, మురళీ కృష్ణ వంటి సీనియర్లు టీవీ9లోనే ఉన్నారు. పొలిటికల్ కంటెంట్ పరంగా.. ఇంటర్వ్యూలు, చర్చల పరంగా ప్రస్తుతానికి ఢోకా లేదు. కానీ మునుపటి కసి టీవీ9లో కనిపిస్తుందా.. టీవీ9లో ఏర్పడిన ఈ శూన్యతను ఇతర ఛానళ్లు సొమ్ము చేసుకుంటాయా.. అన్నది చూడాలి..