దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చుపుతున్న కరోనా వైరస్ వల్ల గత విద్యా సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం గందరగోళంగా మారింది. పదో తరగతి, ఇంటర్, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదవబోయేవాళ్లు రోజురోజుకు భారీగా నమోదవుతున్న కేసుల వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 
 
తెలంగాణ సర్కార్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులను ఇప్పటికే పై తరగతులకు ప్రమోట్ చేసింది. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షల ఆధారంగా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించక మునుపే ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. అయితే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలు మాత్రం నిలిచిపోయాయి. 
 
రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల కాలేజీలు, యూనివర్సిటీలు తెరిచే పరిస్థితి లేదు. విద్యా సంవత్సరం ఎప్పటినుంచి ప్రారంభమవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో సోషల్, వెబ్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా తెలంగాణ ఇంటర్ బోర్డ్ 30 శాతం సిలబస్ ను తగ్గించే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ సిలబస్ ను తగ్గించాలని ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. వచ్చే నెల 17 నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని పాఠశాలల పునఃప్రారంభం గురించి త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 30 శాతం ఆన్ లైన్ క్లాసులు, 70 శాతం ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించబోతున్నట్టు తెలిపారు.                

మరింత సమాచారం తెలుసుకోండి: