వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ట్విట్టర్ వేదికగా టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశారు. జగన్ సర్కార్ సీఆర్డీఏ చట్టం రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపగా ఈ బిల్లుపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ జరుగుతున్న సమయంలో ఈ బిల్లులను ఆమోదించవద్దని, బిల్లులను తిరస్కరించి రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపాలంటూ కన్నా లేఖ రాశారు. 
 
ప్రభుత్వం పంపిన బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని ఆమోదించవద్దని... శాసనమండలి సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపించడంతో వాటిని ఆమోదించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం కూడా రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేసిందని లేఖలో ప్రస్తావించారు. రాజధానిని తరలించడం వల్ల అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించడం లేదని... సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, వికేంద్రీకరణ బిల్లు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. 
 
ఏపీ విభజన చట్టంలో ఒక్క రాజధానినే మాత్రమే పేర్కొన్నారని దీనిపై రాజ్యాంగపరంగా ముందుకెళ్లాలని సూచించారు. రాజధాని ప్రాంత ప్రజల శాంతియుత నిరసనలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన తెలిపారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కన్నా గవర్నర్ కు లేఖ రాయడంతో చంద్రబాబు కోవర్టు అని మళ్ళీ స్పష్టమైందని పేర్కొన్నారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాసి కన్నా పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యాడని పేర్కొన్నారు. 
 
మరో ట్వీట్లో ఏపీ సంక్షేమ పథకాలను మాయామశ్చింద్రాలంటావా? కిట్టూ అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే డబ్బులిస్తానని మీ చంద్రబాబు అన్నప్పుడు ఈ నీతులు ఏమైపోయాయని.... దేశంలోనే డర్టీయెస్ట్ పొలిటీషియన్ గురించి నీ చెత్త పలుకులో ఎప్పుడైనా రాశావా అని ప్రశ్నించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: