దేశంలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం చాలామందికి కరోనా సోకినా జ్వరం, జలుబు, దగ్గులాంటి లక్షణాలు కనిపించడం లేదు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవాళ్లకు పరీక్షల్లో మాత్రమే వైరస్ సోకిందో లేదో తెలుస్తోంది. 
 
రోజురోజుకు లక్షణాలు కనిపించని కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే వైద్యులు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లలో కరోనా లక్షణాలు కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తాజాగా ఐసీఎంఆర్ కరోనా సోకిన వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు లేకపోతే 17రోజుల తర్వాత విధులకు హాజరు కావచ్చని చెబుతోంది. 17 రోజుల తర్వాత కరోనా పరీక్షలు కూడా అవసరం లేదని సూచించింది. 
 
వైద్యులు కరోనా సోకిన వాళ్లలో చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదని.... లక్షణాలు లేకపోతే హోం ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇంటి దగ్గర ప్రత్యేక గది, బాత్ రూం సౌకర్యం లేని వాళ్లు ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండాలని సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించని వ్యక్తులు పది రోజులు ఐసోలేషన్ లో ఉండాలని... 17 రోజుల అనంతరం యథావిధిగా విధులకు హాజరు కావచ్చని చెబుతున్నారు. 
 
17 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ లోనే ఉండటం మంచిదని... ఆస్పత్రిలో చేరి డిశ్చార్జి అయిన వాళ్లు మాత్రం లక్షణాలు తిరిగి కనిపించకపోతే విధులకు హాజరు కావాలని.... కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్యుల సూచనలు తీసుకుని విధుల్లో చేరాల్సి ఉంటుందని చెబుతున్నారు. వైద్యులు ప్రజలు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలా చేస్తే మాత్రమే వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: