ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలు రోడ్లపై సంచరించాలంటే భయపడేలా చేస్తున్నాయి. భారత్ లో లాక్ డౌన్ నిబంధనలు సడలించిన రోజు నుంచి వైరస్ వ్యాప్తికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. దేశమంతటా భారీగా కేసులు నమోదవుతూ ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఇప్పట్లో వైరస్ ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదని ప్రజలు భావిస్తున్నారు. 
 
కరోనా వ్యాక్సిన్ కోసం అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. తొలి దశ క్లినికల్ ట్రయల్స్ లో పలు దేశాల వ్యాక్సిన్ లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ఏ దేశం వ్యాక్సిన్ మొదట అందుబాటులోకి వస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో పలు దేశాలు కరోనా టీకాల కోసం ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. బ్రిటన్ ప్రజలకు కరోనా టీకాను వీలైనంత త్వరగా అందుబాటులో తెచ్చేందుకు టీకాల కోసం ఒప్పందాలు చేసుకుంది. 
 
ఫైజర్‌ ఫార్మా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా బ్రిటన్ 3 కోట్ల డోసుల సరఫరాకు హామీ పొందింది. ఫ్రెంచ్ కంపెనీ వాల్‌నెవాతో 6 కోట్ల డోసుల కోసం అగ్రిమెంట్లు చేసుకుంది. వ్యాక్సిన్ సక్సెస్ అయితే మరో 4 కోట్ల డోసులు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. పది కోట్ల ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ డోసుల కోసం బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ఆస్ట్రాజెనె‌కాతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 
 
వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రపంచ దేశాల నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉండటంతో బ్రిటన్ ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. మంత్రి అలోక్ శర్మ ప్రముఖ ఔషధ, వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో ఈ కొత్త భాగస్వామ్యంద్వారా ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే వ్యాక్సిన్‌ను భద్రపరచడానికి తమకు ఉత్తమమైన అవకాశం లభించిందని ఆయన అన్నారు. మరోవైపు ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఫలితాలు ఈరోజు వెల్లడి కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: