రఘురామకృష్ణంరాజు..గత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హైలైట్ అవుతున్న పేరు. వైఎస్సార్‌సీపీ తరుపున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘు...సొంత పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పి హడావిడి చేసేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ కంటే ఎక్కువగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పైగా ఇంత హడావిడి చేస్తూ కూడా తాను సొంత ఇమేజ్‌తో గెలిచానని డప్పు కొట్టుకుంటున్నారు.
జగన్ బొమ్మకు కొన్ని ఓట్లు పడితే, తన బొమ్మకు కూడా కొన్ని ఓట్లు పడ్డాయని, అందువల్లే స్వల్ప మెజారిటీ తేడాతో బయటపడ్డానని చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాజుగారు చెబుతున్నట్లు నరసాపురంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా లేవని తెలుస్తోంది. అక్కడి జనం జగన్‌ని చూసే ఓట్లు వేశారు. ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా జగన్ గాలిలోనే గెలిచారు.
అసలు నరసాపురం పార్లమెంట్‌లోని ప్రజలకు రాజుగారు గురించి పెద్దగా తెలియదనే చెప్పాలి. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వేటుకూరి శివరామరాజు అయిన నరసాపురం ప్రజలకు తెలుసుగానీ, బిజినెస్ చేసుకుంటూ... హైదరబాద్, ఢిల్లీల్లోనే ఎక్కువ గడిపే రఘు గురించి తెలియదు. కాబట్టి నరసాపురంలో రాజుగారికి అంత సీన్ లేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఒకవేళ రాజుగారిపై వేటు ఏమన్నా పడి నరసాపురం పార్లమెంట్‌కు ఉపఎన్నిక వచ్చి, మళ్ళీ ఆయన తిరిగి పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు మళ్ళీ జగన్ వైపే ఉన్నారని వైఎస్సార్‌సీపీ అంతర్గత సర్వేలో తేలిందట. దాదాపు 58 శాతం వరకు ప్రజలు మళ్ళీ వైఎస్సార్‌సీపీనే గెలిపించాలని చూస్తున్నారట. ఇక టీడీపీకి 37 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని, జనసేన-బీజేపీలకు కలిపి 4-5 శాతం ఓట్లు రావోచ్చని తెలిసింది.
ఒకవేళ రఘు ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా, జనసేన-బీజేపీ పొత్తులో పోటీ చేసినా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అర్ధమవుతుంది. ఒకవేళ టీడీపీ సపోర్ట్ తీసుకున్న రాజుగారు గెలవడం కష్టం. మొత్తానికైతే నరసాపురంలో రాజుగారికి పెద్ద ఇమేజ్ లేదని తేలిపోయింది.