అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అంటే ఆషామాషీ కాదు. నియోజకవర్గ ప్రజలకు కానీ, తమ అనుచరులకు గాని, తమ సిపార్సులకు గాని ఎటువంటి ఆటంకం లేకుండా, అన్ని పనులు ఆగమేఘాల మీద జరిగిపోతాయి. ఇక జనాలు ఎమ్మెల్యేలు ఇంటి చుట్టూ తిరుగుతూ తమ సమస్యలను చెప్పుకుని పనులు చేయించుకుంటారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే నా మజాకా అన్నట్టుగా వారు ఒకింత గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇదంతా గతం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత ఎవరికి ఏ అవకాశం దొరకకుండా ప్రజలకు కావలసిన అన్ని పనులను వారి ఇళ్ల వద్దకే అందించే విధంగా ఏపీ సీఎం జగన్ ఏర్పాట్లు చేశారు. ఏ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా, ఇతర ఏ విషయాల పైన అయినా, ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్ని సౌకర్యాలు ఇంటి వద్ద నుంచే పొందే విధంగా ఏర్పాట్లు చేశారు.
అలాగే ప్రతి పనిలోనూ పారదర్శకతను పెంచే విధంగా అనేక మార్పులు చేశారు. అసలు ప్రజాప్రతినిధుల అవసరమే లేకుండా, పూర్తిగా అధికారులు అన్ని కార్యక్రమాలను చక్కబెట్టే విధంగా ఏపీలో పరిపాలన సాగుతోంది. ఈ విధానంపై ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు, ప్రభుత్వంపై మరింతగా నమ్మకం పెరిగింది. తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్న నమ్మకం వృధా కాలేదు అనేది జనాల అభిప్రాయంగా ఉంటే, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు అధినేత తీరుపై ఆగ్రహంగా ఉన్నారనే ఫీడ్ బ్యాక్ జగన్ వరకూ చేరుతోంది. అసలు వీరు బాధ ఏమిటంటే..? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఈ కాలం తాము పూర్తిగా డమ్మీలుగా మారిపోయామనే అభిప్రాయం వీరిలో ఉంది.
సంక్షేమ పథకాలు కానీ, లబ్ధిదారుల ఎంపిక కాని, తాత్కాలిక ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కానీ, ఏ విషయంలోనూ, తమ మాట చెల్లుబాటు కావడం లేదనే అభిప్రాయం, అసహనం అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో పెరిగిపోతోందని, గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీగానే ఉంటున్నామని, తాము చేసేందుకు కూడా ఏ పని లేదు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందని, నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లోనూ, అధికారులు జోక్యం ఎక్కువగా ఉంటోందని, అధినేత జగన్ కూడా ఎక్కువగా అధికారులకు ప్రాధాన్యత ఇస్తూ, తమను పెద్ద పట్టించుకోవడంలేదని, తమ సమస్యను చెప్పినందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదనే బాధ వీరిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సాధారణంగానే ఈ విషయంలో ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు అనేకమంది ఈ ఉద్యోగాల విషయంలో తమ వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తూ ఉంటారు. కానీ అటువంటి విషయాల్లోనూ, తమ మాట చెల్లుబాటు కాకుండా, అసలు ఎమ్మెల్యేల ప్రమేయమే లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ అయిపోవడం వంటి విషయాలు వైసీపీ ఎమ్మెల్యేలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. తమను మరింతగా కట్టడి చేయడం వల్ల ప్రజల్లోనూ, పార్టీ నాయకుల్లోనూ మరింతగా చులకన అవుతామని, అసలు తమ మాట చెల్లుబాటు కానప్పుడు తమ చుట్టూ తిరిగేందుకు క్యాడర్ ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇవే విషయాలు జిల్లా ఇంచార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నా, పెద్దగా ప్రయోజనం ఉండడం లేదట. మొదటి నుంచి ఇదే రకమైన అసంతృప్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఉంటూనే వస్తోంది. కాకపోతే ఇది మరింతగా ముదరక ముందే ఈ విషయాలపై జగన్ దృష్టిపెడితే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది.