2019 ఎన్నికల సమయంలో జగన్ వేవ్‌ని ముందుగానే అర్ధం చేసుకుని కొందరు టీడీపీ నేతలు వరుసపెట్టి వైఎస్సార్‌సీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎలాగో జగన్ అధికారంలోకి వచ్చేస్తారు కాబట్టి తమకు ఏదొక పదవి వస్తుందనే ఉద్దేశంతో టీడీపీ నేతలు చంద్రబాబుకు షాక్ ఇచ్చేశారు. అప్పుడు అలా షాక్ ఇచ్చిన వారిలో ముగ్గురు ఎంపీలు కూడా ఉన్నారు. 2014లో టీడీపీ తరుపున ఎంపీలుగా గెలిచిన అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబులు, వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు.
 
వీరితో పాటు బుట్టా రేణుక కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే ఇందులో అవంతి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, ఇప్పుడు జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. అటు పండుల రవీంద్రబాబుకు ఎన్నికల్లో జగన్ సీటు ఇవ్వలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. కానీ బుట్టా రేణుకకు మాత్రం జగన్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. 

 

అలా బుట్టాకు జగన్ ఎలాంటి పదవి ఇవ్వకపోవడానికి కారణం లేకపోలేదు. 2014 ఎన్నికల్లో బుట్టా కర్నూలు నుంచి వైఎస్సార్‌సీపీ తర‌పున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కానీ మధ్యలో బాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీ వైపున‌కు వచ్చేశారు. పార్టీకి గానీ, పదవికి గానీ రాజీనామా చేయకుండా టీడీపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి బుట్టా టీడీపీ తరుపున ఎమ్మిగనూరు సీటు ఆశించారు. 

 

బాబు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అలా అని తన సిట్టింగ్ స్థానమైన కర్నూలు ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. దీంతో ఎన్నికల ముందు బుట్టా వైఎస్సార్‌సీపీలోకి వెళ్లారు. అక్కడ జగన్ కూడా రేణుకకు ఏ సీటు కేటాయించలేదు. అప్పుడు ఎన్నికల్లో బుట్టా రేణుక వైఎస్సార్‌సీపీ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేశారు. తర్వాత వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. అలా  అని జగన్, రేణుకకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. తాజాగా కూడా పండుల రవీంద్రకు ఎమ్మెల్సీ ఇచ్చారు గానీ, బుట్టాని మాత్రం లైట్ తీసుకున్నారు. అధికారం కోసం పార్టీని వదిలేసి వెళ్ళి, మళ్ళీ తిరిగి వచ్చి, నమ్మకం కోల్పోవడంతోనే బుట్టాకు ఎలాంటి పదవులు దక్కడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: