దేశం మొత్తం కరోనాతో నరకయాతన పడుతుంటే... మీరు ప్రభుత్వాలు కూలుస్తూ... రాజకీయాలు చేస్తారా? అంటూ భారతీయ జనతా పార్టీపై ధ్వజమెత్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సమాఖ్య వ్యవస్థను కూడా రద్దు చేసి... వన్ నేషన్...వన్ పార్టీగా మార్చేసుకోండి అంటూ ఫైర్ అయ్యారు. బయట వ్యక్తులు తమ రాష్ట్రాన్ని పాలించే అవకాశం బెంగాల్ ప్రజలు ఇవ్వరంటూ కమలదళంపై విరుచుకుపడ్డారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉగ్రకాళిగా మారిపోయారు.. బీజేపీ, అమిత్‌షా, నరేంద్రమోడీ పేరు ఎత్తుతేనే.. చిరాకు పడే మమత దీదీ.. మరోసారి రాజకీయ ప్రత్యర్ధులపై పదునైన అస్త్రాలను సంధించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిస్తున్నారా అనే స్థాయిలో బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం కరోనా కష్టకాలంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు బీజేపీ కుప్పకూల్చుతోందని విమర్శించారు. మధ్య ప్రదేశ్ తర్వాత రాజస్థాన్, వెస్ట్ బెంగాల్‌పైనే వాళ్ల ఫోకస్ ఉందంటూ విమర్శించారు.
దేశం మొత్తాన్ని గుజరాతే పరిపాలించాలా... నరేంద్ర మోడీ, అమిత్ షాకు ఈ దేశాన్ని అప్పగించాలా.. అదే జరిగితే ఇక సమాఖ్య వ్యవస్థకు అర్ధం ఏంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ తమ పార్టీయే ఉండాలని బీజేపీ కోరుకుంటుందని... సమాఖ్య వ్యవస్థను రద్దు చేసేసి...వన్ నేషన్ వన్ పార్టీ గా మార్చేస్తే పోతుందిగా అంటూ సెటైర్లు వేశారు. కేంద్ర తన అధికారాన్ని, మనీ పవర్‌ను అడ్డం పెట్టుకుని విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలల్లో అస్థిరత సృష్టిస్తోందని విమర్శించారు.
బెంగాల్‌లో అధికారంలోకి రావాలన్న బీజేపీ ఆశలు నెరవేరవన్నారు మమతాబెనర్జీ. తమ రాష్ట్రానికి సంబంధించినంత వరకు బీజేపీ బయట పార్టీయేనన్నారు. వచ్చే అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి బీజేపీ అభ్యర్ధి డిపాజిట్ గల్లంతయ్యేలా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపిచ్చారు. బీజేపీ విధానాలతో విసిగిపోయిన బెంగాల్ ప్రజలు ఆ పార్టీకి గట్టిగానే బుద్ధి చెబుతారన్నారు. తమ ప్రభుత్వంపై వేలెత్తి చూపే ముందు... ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న జంగిల్ రాజ్... ఎన్‌కౌంటర్ రాజ్‌ల గురించి చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు.