ఏపీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కరోనా భారీన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ కాగా నిన్న వైయస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా సోకింది. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో అంబటి రాంబాబుకు ఒకసారి నెగిటివ్ మరోసారి పాజిటివ్ నిర్ధారణ అయింది. 
 
స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలుగు చూడటం గమనార్హం. అయితే ఆయనకు కరోనా సోకిందో లేదో తెలుసుకునేందుకు అధికారులు మరోసారి పరీక్షలు నిర్వహించబోతున్నారని సమాచారం. అయితే అంబటికి కరోనా అంటూ జరుగుతున్న ప్రచారంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. మూడోసారి చేసే పరీక్షల్లో వైరస్ ఫలితాన్ని అంబటి ఆస్పత్రిలో చేరాలో వద్దో నిర్ణయం తీసుకోనున్నారు. 
 
మరోవైపు రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు వైరస్ సోకుతూ ఉండటంతో వారితో సన్నిహితంగా మెలిగిన నేతలు ఆందోళనకు గురవుతున్నారు. అధికార పార్టీ నేతలు కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ ఉండటంతో పాటు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ ఉండటంతో వైరస్ భారీన పడుతున్నారు. తెలంగాణలో కూడా పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 11 నుంచి భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే దాదాపు 5,000 కేసులు నమోదయ్యాయంటే వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందో సులభంగానే అర్థమవుతుంది. దేశంలో కరోనా కేసుల పరంగా ఏపీ ఐదో స్థానంలో ఉంది. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంతో ప్రభుత్వం సక్సెస్ కావడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరీక్షల పరంగా ఏపీ ముందువరసలో ఉంది. తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: