తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెండు రోజుల క్రితం తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా  మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,554 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 49,259కు చేరింది. రాష్ట్రంలో దాదాపు 50,000 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 842 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,281 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వాళ్ల సంఖ్య 37,666కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 11,155 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
గత 24 గంటల్లో 9 మంది మృతి చెందగా కరోనా మృతుల సంఖ్య 438కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 15,882 శాంపిళ్లను పరీక్షించారు.  కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కేసులు పెరుగుతుండటంతో పరీక్షల సంఖ్య పెంచుతోంది. సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి అధికారులకు వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కరోనా అదుపులోనే ఉంది. తెలంగాణ పొరుగు రాష్ట్రమైన ఏపీని కరోనా కమ్మేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,045 మందికి కరోనా నిర్ధారణ కాగా 65 మంది మృతి చెందారు. నమోదైన కేసుల్లో విశాఖ జిల్లాలోనే 1,049 కేసులు నమోదు కావడం గమనార్హం.                 
 

మరింత సమాచారం తెలుసుకోండి: