తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1,554 కొత్త కేసులు నమోదు కాగా 9 మంది మృతి చెందారు. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని చర్యలు చేపడుతోంది. ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కరోనా వైరస్ కట్టడి చర్యల గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారుల‌తో మాట్లాడారు. జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరినీ వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయాల‌ని సూచించారు. 
 
ఈ విధంగా చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఇప్పటివరకు ఎన్నో వైరస్ లు విజృంభించినా ఆ వైరస్ లను సులభంగా ఎదుర్కొన్నామని.... కరోనా వైరస్ భయాందోళనను జయించగలిగామని చెప్పారు. మ‌శూచి, సార్స్ వంటి అనేక ర‌కాల వైర‌స్‌ల‌ు గతంలో ప్రబలాయని ఆయన గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. 
 
ఊపిరితిత్తులు, శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారికి వైరస్ సోకితే త్వరలో కోలుకోలేకపోతున్నారని.... మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా సోకకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. రాష్ట్రంలో పరీక్షల సంఖ్య భారీగా పెంచామని... రాపిడ్ టెస్టులు అందుబాటులోకి వ‌చ్చాక పరీక్షల సామర్థ్యం పెరిగిందని చెప్పారు. త్వరగా వైరస్‌ను గుర్తిస్తే ప్రాణ నష్టం జరగకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని అన్నారు.       
 
ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు జ్వరం వచ్చిన వారిని త్వరగా గుర్తించి వీలైనంత త్వరగా పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం కేసులు నమోదైన ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: