నిన్న మొన్నటి వరకూ ఆ టాబ్లెట్ కరోనా రోగుల పాలిట దివ్య ఔషధం అనుకున్నారు. కరోనాను కట్టడి చేస్తుందనుకున్నారు. చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మోడీకి ఫోన్ చేసి ఆ టాబ్లెట్లు పంపించమని కోరాడు.. ప్రపంచమంతా ఆ టాబ్లెట్ల కోసం ఇండియా వైపు చూసింది. అదే.. హైడ్రాక్సీ క్లోరోక్విన్.
హైడ్రాక్సీ క్లోరోక్విన్.. దీన్ని సింపుల్ గా హెచ్‌సీక్యూ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు టాబ్లెట్ గురించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ టాబ్లెట్‌తో కరోనా రోగులకు పెద్దగా ఉపయోగమే లేదట. ఈ టాబ్లెట్ విడిగా వేసుకున్నా.. లేక.. యాంటీబయోటిక్ ఔషధం అజిత్రోమైసిన్‌తో కలిపి వేసుకున్నా కరోనాను అరికట్టడంలో పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదట.
అసలు ఈ హైడ్రాక్సీక్లోరోక్వీన్ ను మలేరియా చికిత్స కోసం వాడతారు. అయితే.. కరోనా వచ్చిన మొదట్లో ఇది కరోనా వైరస్ ను అడ్డుకుంటుందని తేల్చారు. కొన్ని పరిశోధనలూ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఫ్రెంచ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ టాబ్లెట్ పనితనంపై రీసెర్చ్ చేశారు.
వారి పరిశోధనలో తేలిందేమంటే.. ఈ ఔషధం అంత ఉపయోగకరం కాదు అని. ఇన్‌ఫెక్షన్‌కు ముందు, వైరస్ సోకిన వెంటనే, వ్యాధి బారిన పడ్డ కొన్ని రోజుల తర్వాత.. ఇలా ఎప్పుడు పరీక్షించినా హెచ్‌సీక్యూ పెద్దగా పనిచేయలేదట.