ఏపీని కరోనా కమ్మేసింది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఏపీలో నిన్న ఒక్కరోజే దాదాపు 8,000 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో ప్రమాదకరస్థాయిలో వైరస్ వ్యాపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వరుసగా కరోనా భారీన పడుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కరోనా నిర్ధారణ అయింది. 
 
గొల్ల బాబూరావు ఈ విషయాన్ని స్వయంగా ఆయన వాట్సాప్ ద్వారా కార్యకర్తలు, నాయకులకు తెలియజేశారని సమాచారం. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే ఎం.సుధాకరరావు, గుంటూరు జిల్లాఎమ్మెల్యే కిలారి రోశయ్య, అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కరోనా భారీన పడ్డారు.       
 
రాష్ట్రంలో ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా ఎన్ని చర్యలు చేపడుతున్నా ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా రోగులు ఇబ్బందులు పడకుండా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఉదయం 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తూ కేసులు పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. 
 
అయితే ప్రజలు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే భారీగా కేసులు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే మాత్రమే వైరస్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: