సామాన్య ప్రజల విషయంలోనే కాదు.. ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల విషయంలోనూ సమాజం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ వైద్యుడు కరోనాతో బాధపడుతూ ఆస్పత్రుల నిర్లక్ష్యానికి బలైపోయారు.

 

కరోనా బాధితులను అంటరాని వాళ్లుగా చూస్తోంది సమాజం. పోరాడాల్సింది రోగితో కాదు..రోగంతో అని తెలిసినా ప్రజల ఆలోచనా ధోరణి మారడం లేదు. చుట్టుపక్కల వాళ్ల అనుమానపు చూపుల నుంచి.. వైద్యం అందించే వరకు కరోనా రోగులు చీత్కారాలను ఎదుర్కొంటున్నారు.

 

ఈ పరిస్థితి సామాన్య ప్రజలకే కాదు డాక్టర్లకు కూడా ఎదురవుతోంది. కరోనాపై పోరులో బాధితులకు మెరుగైన వైద్యం అందించిన బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్... తాను కరోనా బారిన పడి.. ఆస్పత్రుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయాడు.

 

కర్ణాటకలోని చిక్కలముడివాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ మంజునాథ్‌కు ఇటీవల కరోనా సోకింది. ఎంతో మంది బాధితులను నేరుగా కలవడంతో ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. పరిస్థితి కొంచెం ఇబ్బంది కరంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరాలనుకున్నారు.

 

మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఒక్కరు కూడా ఆయన్ను ఎడ్మిట్ చేసుకోలేదు. జేపీ నగర్‌లోని రాజశేఖర్‌ ఆసుపత్రి, కెంగెరీలోని బీజీఎస్‌ గ్లోబల్‌ ఆసుపత్రి, కుమార స్వామి లే అవుట్‌లోని సాగర్‌ ఆసుపత్రులు మంజునాథ్‌ను చేర్చుకోవడానికి నిరాకరించాయి.

 

కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో డాక్టర్ మంజునాథ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. డాక్టర్ అని తెలిసినా... ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. చివరకు బెంగళూరు మెడికల్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.

 

చికిత్స పొందుతూ మంజునాథ్ ప్రాణాలు కోల్పోయారు. మూడు ఆస్పత్రుల్లో కనీసం ఒక్క ఆస్పత్రైనా సరైన సమయంలో స్పందించి ఉంటే మంజునాథ్ ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: