అమెరికా, చైనా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరి మధ్య బంధాలు దూరమైపోతున్నాయి. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వివాదాలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది.కొన్ని రోజులుగా డ్రాగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అగ్రరాజ్యం.. ముందు ప్రకటించినట్లుగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీనికి ప్రతిగా చైనా ప్రతీకార చర్యలు చేపట్టింది.

 

అమెరికా-చైనా మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. అమెరికాలోని చైనా దౌత్య కార్యాలయాలు గూఢచర్యానికి పాల్పడుతున్నాయని అగ్రరాజ్యం ఆరోపించింది. దీనికి హ్యూస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం కేంద్రంగా మారిందని అమెరికా విదేశాంగమంత్రి పాంపియో స్పష్టం చేశారు. అందుకే దాన్ని మూసివేయించామన్నారు. మేధో సంపత్తిని సైతం చైనా దొంగిలిస్తోందన్నారు. తద్వారా కీలక వ్యాపార రహస్యాలనూ ఛేదించి.. అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైందని ఆరోపించారు.

 

చైనా రోజురోజుకీ కొత్త కుట్రలు, దౌర్జన్యాలకు తెరతీస్తోందని మైక్‌ పాంపియో ఆరోపించారు. వీటిని ఎదుర్కొని, డ్రాగన్‌ దూకుడును అడ్డుకోవడానికి స్వేచ్ఛాయుత దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సొంత దేశంలో నియంతృత్వ వైఖరిని అవలంబిస్తున్న చైనా.. ఇతర ప్రాంతాల్లోని స్వేచ్ఛను సైతం హరించాలని చూస్తోందని పరోక్షంగా హాంకాంగ్ పరిణామాలను ప్రస్తావించారు. స్వేచ్ఛాయుత దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి చైనా కమ్యూనిస్టు పార్టీని మార్చాలన్నారు. లేకుంటే .. సీపీపీయే ప్రపంచాన్ని మార్చివేసే ప్రమాదం ఉందన్నారు. సోవియట్‌ యూనియన్‌, అమెరికా మధ్య యుద్ధాన్ని చైనా అనుకూలంగా మార్చుకుందన్నారు. ఆ సమయంలో పశ్చిమ దేశాల ద్వారా లబ్ధి పొంది ఆర్థికంగా పరిపుష్టి సాధించిందన్నారు.

 

హ్యూస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేయడంతో.. చైనా ప్రతీకార చర్యలు చేపట్టింది. చెంగ్డూలోని అమెరికా దౌత్యకార్యాలయ నిర్వహణకు ఉన్న అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాతో సంబంధాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని.. ఇలాంటి పరిస్థితుల్ని తాము కోరుకోలేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: