ఆంధ్రప్రదేశ్ పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,147 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలోని 13 జిల్లాల్లో వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 77,963 కేసులు నమోదు కాగా 933 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 
 
జిల్లాలో ఒక్కరోజే 1,029 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 11,067కు చేరింది. జిల్లాలో 11,000కు పైగా కేసులు నమోదు కావడంతో అధికారులు కొత్త కేసులు నమోదు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో రాజమండ్రి అర్బన్ లో 251 కేసులు, రాజమండ్రి రూరల్ లో 185 కేసులు, కాకినాడ సిటీలో 134 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా అనుమానితులు రాపిడ్ టెస్ట్ లకు క్యూ కడుతున్నారు. 
 
రాష్ట్రంలోని కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. కర్నూలులో 9,615 కేసులు నమోదు కాగా గుంటూరులో 8,800 కేసులు, అనంతపురంలో 8,266 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతూ ఉండటం ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. 
 
కరోనా కేసులు ఎక్కువవుతూ ఉండటంతో పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. జిల్లావ్యాప్తంగా కాకపోయినా కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఆగస్టు నెల రెండో వారం వరకు ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ పురోగమనంలో ఉందని ఆగస్టు మూడవ వారం నుంచి వైరస్ తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: