దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం ఎలా ? రోజురోజుకూ విస్తరిస్తున్న మహమ్మారికి ఎలా చెక్ పెట్టాలి ? ఈ అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఎల్లుండి రాష్ట్రాల సీఎంలతో సమావేశంకానున్నారు. అన్ లాక్ 3.0పై చర్చించనున్నారు. 

 

కరోనా వైరస్ జెట్ స్పీడ్ తో  వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 13 లక్షలు దాటేసింది. ప్రతిరోజూ దాదాపు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. సెప్టెంబరుకల్లా ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో దేశంలో కరోనా కట్టడికి ఏం చేయాలి ? కేసుల సంఖ్య పెరిగితే.. ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే అంశాలపై ప్రధాని నరేంద్ర  మోడీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఈ నెలాఖరుతో అన్ లాక్ 2.0 ముగియనుంది. ఇక అన్ లాక్ 3.0 ఎలా ఉండాలి ? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడకుండా కరోనాను  కంట్రోల్ చేయగలం అనే విషయాలపై సీఎంల అభిప్రాయాలు తీసుకోనున్నారు ప్రధాని.

 

ఏప్రిల్ నుంచి పలు దఫాలుగా సీఎంలతో ప్రధాని సమావేశం అయ్యారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించిన తర్వాత లాక్ డౌన్ సడలింపులు ప్రకటించారు. ఇప్పుడు కూడా మరోసారి వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పాల్గొనున్నారు. గత వారం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, బీహార్, అసోం, ఉత్తరాఖండ్ సీఎంలతో ప్రధాని ఫోన్ లో మాట్లాడారు. కరోనా తీవ్రతను తగ్గించడానికి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల్ని తెలుసుకున్నారు. టెస్టింగ్ లు పెంచాలని, కంటైన్మెంట్ ప్లాన్ అమలు చేయాలని, ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు పెంచాలని కోరారు.

 

సెప్టెంబరు నాటికి దేశంలో ప్రతిరోజూ లక్ష వరకు కరోనా కేసులు నమోదు కావొచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తే.. ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దేశంలో ఐసీయూ పడకలకు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్న తరుణంలో... ఈ అంశాలపై చర్చించే అవకాశముంది. అన్ లాక్ తర్వాత ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటుండటంతో.. ఆ దిశగా మరికొన్ని నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. స్కూల్స్, జిమ్ లు, ధియేటర్లు.. ఇలా కొన్నింటిపై నిషేధం కొనసాగుతోంది. అన్ లాక్ 3.0లో వీటి పరిస్థితి ఏమిటనేదానిపై ప్రధానితో సీఎంల సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: