కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 21 సంవత్సరాలైంది. భారత సైన్యం పాక్ సైన్యంపై సాధించిన అసామాన్య విజయానికి ప్రతీక ఈరోజు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు కార్గిల్ యుద్ధం విజయం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రజలు కార్గిల్ విజయాన్ని ఎప్పటికీ మరిచిపోరని... అప్పటి భారత ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ సైన్యాన్ని ఉత్తేజపరిచిన తీరు అమోఘం అని అన్నారు. 
 
దేశాన్ని ఒక్కటిగా నడడటంలో వాజ్ పేయ్ గొప్ప విజ్ఞత ప్రదర్శించారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీరమరణం పొందిన సైనికుల త్యాగం వృథా కాదని అన్నారు. దేశభక్తిని పెంపొందించడం, దేశం కోసం పోరాడడంతో పాటు దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం అయ్యే విధంగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్గిల్ అమరవీరుల స్ఫూర్తితో డ్రాగన్ కుట్రలు, కుతంత్రాలను భారత్ ప్రజలు తిప్పి కొడతారని చెప్పారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు బాసటగా నిలవాలని సూచనలు చేశారు. ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో భారత సైన్యం యుద్ధంలో అమర జవాన్ల పోరాటాన్ని స్మరించేందుకు జులై 26వ తేదీన విజయ్ దివస్ నిర్వహిస్తోంది. ఈ యుద్ధానికి తొలి కారణం పాక్ సైనికులు, తీవ్రవాదులు. 
 
తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారత‌దేశంలోకి చొరబడటంతో ఈ యుద్ధం మొదలైంది. 1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్థాన్ మధ్య శాంతియుత లాహోర్ ఒప్పందం జరగగా ఇరు దేశాలు దౌత్యపరంగా, శాంతియుతంగా పరిష్కారం చూపుకోవాలని అనుకున్నాయి. అయితే పాక్ సైన్యం ఉగ్రవాద మూకలను భారత్ భూభాగంలోకి పంపింది. గడ్డకట్టే చలిలో.. పర్వతాల్లో ఏ మాత్రం సహకరించని వాతావరణంలో.. దాదాపు 60 రోజుల పాటు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో మన దేశానికి చెందిన 527 మంది జవాన్లు మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: