ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్ ను మరింత సులభతరం చేసింది. ప్రయాణికులు ఇకపై ఎక్కువగా కష్టపడకుండానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ రూపురేఖలను పూర్తిగా మార్చింది. అతి త్వరలో మార్పులుచేర్పులతో కొత్త వెబ్ సైట్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇండియన్ రైల్వేస్ ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ను ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో అప్ గ్రేడ్ చేయడానికి సిద్ధమైంది.
రెండేళ్ల క్రితం రైల్వే శాఖ వెబ్ సైట్ ను అప్ గ్రేడ్ చేయగా తాజాగా మరోసారి వెబ్ సైట్ అప్ గ్రేడ్ కానుంది. ఇండియన్ రైల్వేస్ బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వెబ్ సైట్ ను అప్ డేట్ చేయనున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఇకపై ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లో ట్రైన్ టికెట్ బుకింగ్ తో పాటు హోటల్ బుకింగ్స్, మీల్స్ బుకింగ్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. వచ్చే నెలలో అప్ గ్రేడ్ అయిన వెబ్ సైట్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.
కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ప్రయాణికుడు కొత్త అనుభూతిని పొందుతాడని అన్నారు. అప్ గ్రేడ్ అయిన వెబ్ సైట్ ద్వారా సులభంగా సీట్ల వివరాలను తెలుసుకోవచ్చని... వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మేషన్ వంటి సౌకర్యాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు. కొన్ని నెలల క్రితం ఇస్రోతో ఇండియన్ రైల్వేస్ భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఈ భాగస్వామ్యం వల్ల ప్రయాణికులు సులభంగా రైలు ఎక్కడుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు వైరస్ విజృంభణ నేపథ్యంలో రైళ్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. పరిమిత సంఖ్యలో రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వైరస్ తగ్గుముఖం పడితే మాత్రమే మాత్రమే పూర్తిస్థాయిలో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారతీయ రైల్వే 109 మార్గాల్లో రైళ్లు నడిపేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’(ఆర్ఎఫ్‌క్యూ) ఆహ్వానించింది. 2023 ఏప్రిల్ నుంచి ప్రైవేట్ రైళ్ల సేవలు దేశంలో అందుబాటులోకి రానున్నాయి.