బాహుబలి యుద్ధ విమానం రాఫెల్.. రేపు భారత్ చేరుకోనుంది. ఇప్పటికే ఐదు రాఫెల్ జెట్ లు ఫ్రాన్స్ నుంచి బయల్దేరాయి. రేపు హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకుంటాయి. రాఫెల్ రాకతో.. చైనా, పాకిస్తాన్ తో యుద్ధం వస్తే.. మనకు అడ్వాంటేజ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

 

ఎన్నోవిశిష్టతలు కలిగిన రాఫెల్ విమానం ఎట్టకేలకు భారత్‌ అమ్ములపొదిలో చేరబోతోంది. భారత వైమానిక దళ సంఖ్యా బలాన్నే కాదు.. పోరాట సామర్థ్యాన్ని,  సాంకేతిక పరిజ్ఞాన స్థాయిని కూడా రాఫెల్ పెంచబోతోంది. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ కొనుగోలు చేసిన 36 రాఫెల్‌ విమానాల్లో మొదటి అయిదు బుధవారం అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకోనున్నాయి. వాయుసేన 17వ స్క్వాడ్రన్‌ అయిన గోల్డెన్‌ యారోస్ లో అవి భాగం కానున్నాయి. 2019లో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై దాడిచేసిన భారత మిరాజ్‌ యుద్ధ  విమానాలు టేకాఫ్‌ అయింది ఈ అంబాలా బేస్‌ నుంచే. రాఫెల్‌ విమానాలను ఈ ఎయిర్‌‌ బేస్ లో మోహరించేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చాలావరకూ  పూర్తయ్యాయి. పైలట్ ల శిక్షణ కూడా ముగిసింది. వీలైనంత త్వరలో వీటిని యుద్ధానికి సిద్ధం చేయాలని వాయుసేన భావిస్తోంది. 

 

ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్‌ నుంచి ఈ  విమానాలు ఇప్పటికే బయలుదేరాయి. 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు చేరబోతున్నాయి. మధ్యలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో ఆగి.. మళ్లీ ప్రయాణం కొనసాగిస్తున్నాయి. సుశిక్షితులైన భారత పైలట్లే వాటిని నడుపుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన రెండు ట్యాంకర్‌ విమానాలు వీటికి  గాలిలోనే ఇంధనాన్ని నింపుతున్నాయి. అవసరమైతే భారత్‌కు చేరిన వారంలోగానే రాఫెల్‌ విమానాలను యుద్ధానికి సిద్ధం చేయగలమని వాయుసేన వర్గాలు  చెబుతున్నాయి. మరో నాలుగు విమానాలను కూడా భారత్‌కు ఫ్రాన్స్‌ అందజేసింది. అవి ప్రస్తుతం ఫ్రాన్స్‌లోనే ఉన్నాయి.

 

పాకిస్థాన్‌ వద్ద ఉన్న విమానాల్లో అమెరికన్‌ ఎఫ్‌-16, చైనా-పాక్‌ జేఎఫ్-17లు ప్రధానమైనవి. వీటిలో ఎఫ్‌-16 అత్యాధునికమైంది. ఆ ఎఫ్‌-16 కంటే మన రాఫెల్‌  నిస్సందేహంగా చాలా మెరుగైన విమానం. ఎఫ్‌-16 సింగిల్‌ ఇంజిన్‌ విమానం కాగా రాఫెల్‌ రెండు ఇంజిన్లు కలిగింది. ఎఫ్‌-16తో పోలిస్తే దీని ధర కూడా చాలా  ఎక్కువే. ఇక చైనా విమానాల్లో జే-20 యుద్ధ విమానం రాఫెల్‌కు గట్టి సవాలు విసరగలదు. జే-20 అనేది ఒక అయిదో తరం స్టెల్త్‌  విమానమని చైనా ప్రకటించుకుంది. స్టెల్త్‌ విమానం నిర్మాణం సాధారణ యుద్ధ విమానాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. స్టెల్త్‌  సామర్థ్యంపై పలు అనుమానాలు ఉన్నాయి. అలాగే అయిదో తరం విమానాలకు ఉండాల్సిన సూపర్‌ క్రూజ్‌ సామర్థ్యం కూడా దీనికి ఇంకా సమకూరలేదనే వాదనలున్నాయి. ఇటీవల ఓ చైనీస్‌ జే-20  విమానాన్ని మన సుఖోయ్‌ విమానమే సులభంగా గుర్తించగలిగిందని, అందువల్ల జే-20 కంటే ప్రస్తుతానికి రాఫెల్ మెరుగైన విమానమని పలువురు నిపుణుల అభిప్రాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: