ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం గురించి కేంద్రానికి మరో లేఖ రాసింది. ఆమె పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలల పాటు పొడిగించాలని జగన్ సర్కార్ కోరింది. ఈ సంవత్సరం జూన్ 30వ తేదీన నీలం సాహ్ని రిటైర్ కాగా ప్రభుత్వం ఆమె పదవీకాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం మాత్రం కేవలం మూడు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించింది.
సెప్టెంబర్ 30వ తేదీతో సీఎస్ పదవీ కాలం ముగియనుంది. జగన్ సర్కార్ తాజాగా రాసిన లేఖకు కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 2019 నవంబర్ 13వ తేదీన ఏపీ సీఎస్ గా నీలం సాహ్ని నియామకం జరిగింది. అంతకుముందు సీఎస్ గా పని చేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేసి ఆయన స్థానంలో నీలం సాహ్నిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయి ఏపీ సీఎస్‌గా భాద్యతలు చేపట్టిన నీలం సాహ్ని తక్కువ సమయంలోనే మంచిపేరు సంపాదించుకున్నారు.
నీలం సాహ్ని 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈమె సుదీర్ఘ కాలం పని చేశారు. నల్గొండ జాయింట్ కలెక్టర్, కలెక్టర్ గా మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్ గా నీలం సాహ్ని పని చేశారు. శిశు సంక్షేమ శాఖ పీడీగా, మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా కూడా పని చేశారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 30 ఆమె పదవీ కాలాన్ని పొడిగించిన కేంద్రం మరోసారి పదవీకాలం పొడిగింపు గురించి జగన్ సర్కార్ రాసిన లేఖపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లేఖలో నీలం సాహ్నిని మరో మూడు నెలలు పదవిలో కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలనికోరింది. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి మహిళా చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని రికార్డులకెక్కింది. ఈమె పదవీకాలం ముగిసిన తరువాత ఈ పోస్టు కోసం సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాస్‌లు పోటీలో ఉన్నారు. వీరు ముగ్గురిలో కాబోయే సీఎస్ ఎవరో తెలియాల్సి ఉంది.