దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ విజృంభణ వల్ల పలు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఇంటర్, డిగ్రీ విద్యార్థులను సైతం పరీక్షలు రాయకుండానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. వైరస్ విజృంభణ వల్ల పరీక్షల తీరుతెన్నులు మారుతున్నాయి. 
 
కొన్నేళ్ల క్రితం పేపర్ పై మాత్రమే పరీక్షలు జరిగేవి. తరువాత కాలంలో పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహించడం మొదలైంది. తాజాగా కరోనా వైరస్ విజృంభణ వల్ల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు, పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓపెన్ బుక్ విధానంలో నిర్వహించనుంది. ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ జవాబుల కోసం అవసరమైతే పుస్తకాల్లో రిఫర్ చేసుకుని రాయవచ్చునని చెప్పారు. 
 
5.71 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్ధులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలు రాయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇంటి నుంచే పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశాలు ఉండవని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అధికారులు పరీక్షలు రాసే విద్యార్థులకు ఐడీలను కేటాయిస్తారు. 
 
పరీక్ష అనంతరం విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సంబంధిత కేంద్రాల్లో సమాధాన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం భారీ సంఖ్యలో ఆన్సర్ షీట్ కలెక్షన్ కేంద్రాలను విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులకు పోస్టు ద్వారా, ఈమెయిల్ ద్వారా సమాధాన పత్రాలను పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. విద్యార్థులు రాయబోయే పరీక్షల ఫలితాలు అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. యూజీసీ డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని ప్రకటించడంతో అన్ని యూనివర్సిటీలు పరీక్షల ఏర్పాట్లు చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: