దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులకు, సినీ సెలబ్రెటీలకు కరోనా నిర్ధారణ అయింది. తాజాగా బీజేపీ ముఖ్య నేత అమిత్ షాకు కరోనా సోకడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
 
అమిత్ షాతో సన్నిహితంగా మెలిగిన వారిని ఆయన ఇప్పటికే అలర్ట్ చేశారు. కొన్ని రోజుల నుంచి తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సలహాలు, సూచనలను అనుసరించి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నానని ఆయన చెప్పారు. తనతో కొన్ని రోజుల నుంచి సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశారు.

 
అమిత్ షాకు వైరస్ నిర్ధారణ కావడంతో గత కొన్ని రోజుల నుంచి ఆయనను కలిసిన బీజేపీ నేతలు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. అమిత్ షాకు కరోనా సోకిందని తెలిసి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రముఖులను సైతం వణికిస్తోంది.
 
ఏపీలో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు నిన్న కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందారు. నేడు యూపీ మంత్రి కమలా రాణి వరుణ్ (62) చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్ను మూశారు. బీహార్ లో 100 మందికి పైగా బీజేపీ నేతలు వైరస్ భారీన పడ్డారు. మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా 50,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కరోనా మరణాల విషయంలో భారత్ ప్రపంచంలో ఐదో స్థానానికి ఎగబాకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: